Heavy Rains in Combined West Godavari District : రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరద బీభత్సంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. వేల ఎకరాల్లో పంటలు నీటమునగడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్ర కాలువ ఉగ్రరూపం దాల్చింది. వందల ఎకరాల పంట పొలాలను ముంచేయడంతో పాటు వివిధ గ్రామాల్లో నివాస గృహాలను ముంచెత్తింది. తణుకు మండలంలో వరద ప్రభావం కొనసాగుతుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయం నుంచి వరదనీటిని దిగువకు వదిలేయడంతో ఎర్ర కాలువ పొంగి పొర్లుతుంది. దీంతో పొలం గట్లు తెగిపోయి వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. అదేవిధంగా రహదారులపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే భారీ వర్షాలకు ఎర్రకాలువకు చేరిన వర్షపు నీరు రైతులను నిలువున ముంచుతోంది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య ఫలితంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వైసీపీ హయాంలో ఎర్ర కాలువకు ఎటువంటి మరమ్మతులు, నిర్వహణ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా భారీ వర్షాలకు ఎర్ర కాలువక పొంగి పొర్లడంతో వరద నీరు ప్రధాన రహదారిపై చేరి రాకపోకలు స్తంభించాయి. సూర్యారావు పాలెం వైపునున్న పసలపూడి, రెడ్డి చెరువు, కాల్ధరి, చిలకపాడు తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఈ రహదారి వెంటనే వెళ్తుంటారు. రహదారిపై రాకపోకలు స్తంభించడం వల్ల సుమారు 7నుంచి 8 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరు నగర్ వరద ముంపు గ్రామాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పర్యటించారు. పెద్దవాగు ప్రాజెక్ట్ కట్ట తెగి ముంపునకు గురై నిరాశ్రయులైన బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. కొట్టుకుపోయిన ఇల్లు, పంటలు, ఇతర వాటిని పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం - బాధితులకు అండగా ఉంటాం: మంత్రులు - Ministerial Reviews on Rains
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సమస్యలన్నీంటిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వెంటనే పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు జిల్లా నుంచి మండల స్థాయి అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా వెంటనే స్పందించి బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపి పెరుగుతోంది. ఈరోజు ఉదయం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 31.7 మీటర్లకు నీటిమట్టం చేరగా 7,96,686 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.