Heavy Rains in Combined Krishna and Guntur Districts: ఎడతెరిపి లేని వర్షాలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా నందిగామ, తిరువూరు జిల్లాల్లో వాగులు, వంకలు ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ముంచెత్తిన వరద నీటితో పంటలకూ పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాల ధాటికి నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాజ్ వే మీదుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. నల్లవాగు, కూచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చందర్లపాడు పాటింపాడు మధ్య ఉన్న రహదారిపై గుర్రాల వాగు పొంగి ప్రవహిస్తుండగా వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం - బాధితులకు అండగా ఉంటాం: మంత్రులు - Ministerial Reviews on Rains
ఎడతెరిపిలేని వర్షాలతో వీరులపాడు మండలం జగన్నాథపురం వద్ద పంట పొలాలు నీట మునిగాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద వాగు పొంగిపొర్లుతోంది. చెవిటికల్లు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. తిరువూరు - అక్కపాలెం రహదారిలో పడమటి వాగు వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తుంది. సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పడమటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కొందరు వాహన దారులు ప్రాణాలు పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. తిరువూరు - అక్కపాలెం మార్గంలో ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. పంటలు నీటమునిగాయి. వర్షాలు, ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీరు కిందకు వదలటంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వెంకట మురళి కొల్లూరు మండలంలోని లంక గ్రామాలను సందర్శించారు. ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు - కొట్టుకుపోతున్న రహదారులు, వంతెనలు - Rains in Alluri District