Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజమహేంద్రవరంలో ఉదయం నుంచి జోరు వాన పడుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో రహదారులపై డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కంబాల చెరువు ప్రాంతంలో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హైటెక్ బస్టాండ్‌ను వర్షం నీరు ముంచెత్తింది. వాన నీరు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వాహనాలు మురుగు నీటిలో చిక్కుకుపోతున్నాయి. ఆర్యాపురం, తుమ్మాలావ ప్రాంతాల్లో వాన నీరు రహదారులపై ప్రవహిస్తున్నాయి. మోరంపూడి జంక్షన్, వీఎల్ పురం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, డీలక్స్ సెంటర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీటిలో రోడ్డుపై ప్రవహించటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చిరు వ్యాపారులు అవస్థల పాలయ్యారు.
అల్పపీడన ద్రోణి ప్రభావం - కురుస్తున్న వర్షాలు - Heavy Rains in Andhra Pradesh
ఎడతెరిపి లేకుండా రోజంతా కురిసిన వర్షంతో ఏలూరు జిల్లా మన్యం మండలాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా జీలుగుమిల్లి, రౌతు గూడెం, వంకావారిగూడెం, దర్భ గూడెం, పూచికపాడు కాలువలు రహదారులపై వర్షం నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాటి ఆకులగూడెం, రౌతు గూడెం వద్ద భారీ వృక్షాలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు జీలుగుమిల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. వేలేరుపాడు మండలం కోయ మాదారం వద్ద కారుతో పాటు కొట్టుకుపోయిన ఐదుగురిని గ్రామస్థులు ప్రాణాలను తెగించి రక్షించారు.
గోదావరి నదికి ఎగువ నుంచి వరద నీరు చేరడంతో ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి రెండు లక్షల 23వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడిచిపెట్టారు. దిగువన ఉన్న వశిష్ఠ. వైనతేయ, గౌతమి గోదావరి నది పాయల్లో వరద నీరు క్రమంగా చేరుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం బూరుగులంక వద్ద రేవులోకి వరద నీరు చేరడంతో అక్కడున్న తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. ఈ కారణంగా బూరుగులంక, అరిగెల వారిపేట, ఊడుమూడి లంక, జి. పెదపూడి లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వీరు ఈరోజు నుంచి అక్టోబర్ వరకు పడవలను ఆచరించి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పరిధిలోని అయినాపురం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన క్రీడా ప్రాంగణమంతా వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో పాఠశాల ముగిసిన అనంతరం నీటిలోనే సైకిల్ని నడిపించుకుంటూ ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు నానావస్థలు పడ్డారు. తక్షణమే నీరు బయటకు పోయే ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జలమయమైన నిడదవోలు బస్టాండ్ - పరిశీలించిన మంత్రి దుర్గేష్ - Roads Flooded Due to Heavy Rains