Heart Disease Reasons in Telugu : పోలీస్ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్న ఓ 36 ఏళ్ల యువకుడు అలసట, చెమటలు పట్టడం వల్ల నీరసంగా ఉండడంతో కరీంనగర్‌లో వైద్య నిపుణులను సంప్రదించగా, పరీక్షలు నిర్వహించి గుండెపోటుగా నిర్ధారించారు. స్టంట్ వేయడంతో కోలుకున్నారు. ఆ యువకుడికి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు లేకపోయినా హార్ట్ అటాక్ రావడంతో ఆ కుటుంబాన్ని ఆందోళనుకు గురి చేసింది.
50ఏళ్ల రైతు రోజూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. ఆరోగ్యమైన జీవనం సాగిస్తున్నారు. కరీంనగర్‌లోని తన కుమారుడి దగ్గరకు వచ్చినప్పుడు సాధారణ వైద్య పరీక్షలు చేయించగా గుండె సమస్య ఉన్నట్లు నిర్ధారణ కావడంతో హస్పిటల్ చేర్పించి చికిత్స చేయించారు.
పై రెండు ఉదాహరణలు చూస్తే ఒకరేమో యువకుడు నిత్యం శ్రమిస్తున్నాు, మరొకరు రోజూ పొలంలో చెమటోడ్చె రైతు. మళ్లీ ఇద్దరికీ ఎలాంటి దురలవాట్లు లేవు అయినా గుండె సంబంధిత సమస్యలు వచ్చాయి. అంటే అందరూ ఎంత అప్రమత్తంగ ఉండాలో తెలియజేస్తుంది. మారుతున్న జీవనశైలి ప్రభావమో లేక ఇతర కారణాలో గాని గుండె సంబంధిత బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. సకాలంలో స్పందించి వైద్యం చేయించుకున్నవారు ప్రాణపాయం నుంచి తప్పించుకుంటుండగా లక్షణాలు గుర్తించలేని వారు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు.
మీకు ఈ విషయాలు తెలుసా:
- మధుమేహం, రక్తపోటు బాధితుల్లో 15శాతం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండూ ఉంటే మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని తెలిపారు.
- అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యం తాగడం, అధిక కొవ్వు పదార్థాలు, మసాల వంటకాలు ఎక్కవగా తినడం వల్ల గుండొ సమస్య తీవ్రతను పెంచుతాయని అంటున్నారు.
- ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంతమంచింది. సమతుల్య ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేసేవారు కూడా ఒత్తిడికి గురైతే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
గుండె సంబంధిత వ్యాధుల లక్షణాలు :
- తీవ్రమైన ఛాతి నొప్పి,
- వికారం,
- శరీరం అంతా చెమటలు పట్టడం
- ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం
- ఛాతిలో నొప్పి మొదలై ఎడమ చేతి, ఎడమ దవడ, కుడి చేతి వరకు లాగుతూ ఉంటాయి.
- నడిచేటప్పుడు ఛాతిలో నొప్పి వస్తూ అసౌకర్యంగా ఉంటే దానిని గుండెపోటుగా లక్షణంగా గుర్తించాలి.
- గుండెలో సమస్య ఉంటే సాధారణం కంటే ఎక్కువగా గుండె కొట్టుకుంటుంది.
గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి.
- సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.
- వేపుళ్లు, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్, శీతల పానీయాలు తాగకుడదు.
- ప్రతి రోజూ శారీరక సామార్థ్యం మేరకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కనీసం 45నిమిషాలు నడక అయినా భాగం చేసుకోవాలి.
- ప్రతి రోజూ మీ శారీరక సామర్థ్యం మేరకు వ్యాయామం తప్పనిసరి. కనీసం 45 నిమిషాలపాటు వాకింగ్ చేయాలి
- ఒత్తిడికి గురికావొద్దు. పనిని ప్రణాళికతో చేయడం ద్వారా చాలా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ధ్యానం, యోగా ద్వారా ఒత్తిడి దూరమవుతుంది.
- ఎవరైనా గుండెపోటుతో అకస్మాత్తుగా పడిపోయి స్పృహ కోల్పోతే వెంటనే ఛాతిపై రెండు చేతులతో గట్టిగా నొక్కుతూ పీసీఆర్ చేయాలి. తర్వాత వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
- 30 ఏళ్లు దాటిన వారు ప్రతి సంవత్సరం సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు గుర్తించొచ్చు.
మితిమీరిన కోపంతో మీ గుండెకు ప్రమాదమా?- పరిశోధనలు ఏమంటున్నాయంటే - Anger Heart Attack Risk