Health Department Special Focus on Pregnant Women : భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్న గర్భిణులపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. వరద ముంపు ప్రాంతాల్లో ఉండి తదుపరి 10 రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న 154 మంది గర్భిణులను ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వీటికి అదనంగా 20 సంచార వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 17,538 మంది రోగులు సేవల్ని అందుకున్నారన్నారు. విజయవాడలో 32 వార్డులు జలదిగ్బంధంలో చిక్కుకున్న దృష్ట్యా అందరకి 6 రకాలైన అత్యవసరమైన మందులను, వాటిని వాడే విధానం తెలియచేసేల కరపత్రాన్ని జత చేస్తూ సుమారు 75,000 కిట్స్‌ను హెలికాప్టర్, పడవలు, రోడ్డు మార్గములో అందించామన్నారు.
విజయవాడలో 14 మెడికల్ రిలీఫ్ క్యాంపులు - అత్యవసర మందుల కిట్లు పంపిణీ - Medical relief Camps
విస్తృత స్థాయిలో వైద్య సహాయక చర్యలు : అత్యవసర వైద్య సేవల కోసమై అదనంగా 25 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్లు కృష్ణబాబు వెల్లడించారు. వరదల కారణంగా వ్యాధులు పెరిగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల కోసమై వచ్చే రోగుల సౌలభ్యం కోసం అదనంగా 100 పడకలను ఏర్పాటు చేశామన్నారు. వివిధ కాలనీల్లో నీటిమట్టం తగ్గు ముఖం పడుతున్నందున సంక్రమిత వ్యాధులు ప్రబలకుండా వైద్య సహాయక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 32 వార్డుల్లో 64 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని వీటిలో రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తారన్నారు. ఈ శిబిరాల్లో 200 రకాల మందులు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలకు ఆరోగ్య సూచనలు, సలహాలు, సేవలు అందించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాల్ని చేపడుతున్నామని వెల్లడించారు.
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ - Sathya Kumar Health Department
హెలీకాప్టర్ ద్వారా అత్యవసర మెడికల్ కిట్లు : ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 75వేల అత్యవసర మందుల కిట్ల పంపిణీ చేశామని కృష్ణబాబు తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఫుడ్ ప్యాకెట్లతో పాటు కొన్ని అత్యవసర మెడికల్ కిట్లను హెలీకాప్టర్ ద్వారా అధికారులు పంపిస్తున్నారని తెలిపారు. అలాగే నగరంలో ఏర్పాటు చేసిన 14 మెడికల్ రిలీఫ్ క్యాంపులకు అత్యవసర మందుల కిట్లను అధికారులు చేరవేస్తున్నారని, మరికొన్ని కిట్లను 10 మొబైల్ మెడికల్ వాహనాల ద్వారా చేరవేశారన్నారు. ఏపీఎంఎస్, ఐడీసీ నుంచి 50వేల కిట్లు, డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి 25 వేల కిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు.