Head Constable Suspended For Sexual Abuse Of Lady Home Guard : ఆడవారి మాన, ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన కొందరు రక్షక భటులు గాడి తప్పుతున్నారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు తమ శాఖలోని మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ విషయాన్ని భర్తతో కలిసి ఉన్నత అధికారులకు చెప్పడంతో హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేశారు.
నిద్రపోతున్న పీసీ : పోలీసులు, బాధిత మహిళ వివరాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సాగర్ ప్రసాద్ రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో నాలుగున్న సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీ నైట్ డ్యూటీలో అర్ధరాత్రి వరకు బయట విధులు నిర్వర్తించాడు. అనంతరం రాత్రి 2.30 గంటల సమయంలో బొమ్మూరు స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సమయానికి స్టేషన్‌లో ఓ మహిళా పీసీ, మరో మహిళా హోం గార్డు విధుల్లో నిర్వహిస్తున్నారు. పీసీ నిద్రిస్తున్న సమయంలో మహిళా హోం గార్డు ఫోన్ చూసుకుంటున్నారు.
ఎస్పీ ఆదేశాలతో సస్పెండ్ : మహిళా హోం గార్డును గమనించిన సాగర్ ప్రసాద్ ఒంటరిగా ఉన్న ఆమెతో అసభ్యకరంగా మాట్లాడి, చెయ్యి పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో హోం గార్డు తన ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేసి హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించిన సాగర్ ప్రసాద్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు భర్తతో కలిసి పోలీసు ఉన్నత అధికారులను బుధవారం కలిసి జరిగిన ఘటనను తెలిపారు. గురువారం సీఐ కేసు నమోదు చేశారు. అనంతరం ఘటనపై విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సాగర్ ప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు సీఐ తెలిపారు.