Har Ghar Tiranga Programme Was Held in AP : 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు మువ్వన్నెల జెండా చేతబూని దేశ సమగ్రత, సమైక్యతను వాడవాడలా చాటి చెప్పారు. భారీ ర్యాలీలు, జెండా ప్రదర్శనలతో ప్రజల్లో దేశభక్తి భావాన్ని నింపేందుకు కృషి చేశారు. మహోజ్వల చరిత్ర గల దేశ సమగ్రతను కాపాడడం మనందరి కర్తవ్యమని విద్యార్థులు తమ ప్రదర్శనలతో తెలియజెప్పారు.
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కీర్తిని నలుదిశలా చాటిచెప్పేలా 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం నిర్వహించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ తమ స్వగృహంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మాచవరంలోని ఎస్ఎస్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో కలెక్టర్ సృజన విద్యార్థులతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో సితార సెంటర్ నుంచి పంజా సెంటర్ వరకు 3,303 అడుగుల భారీ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనయపాలెంలో 200 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వినుకొండలో కూటమి నేతల ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల దేశ నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి చర్చి సెంటర్ వరకు భాష్యం స్కూల్ విద్యార్థులు 700 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు ఆకట్టుకున్నాయి. సుమారు 300 మంది చిన్నారులు స్కేటింగ్ రింక్‌లో 'హర్ ఘర్ తిరంగా' పాటకు లయబద్ధంగా స్కేటింగ్ చేసి అబ్బురపరిచారు. స్టూడెంట్ యూనియన్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో విశాఖ జైలు రోడ్ సమీపంలో 25 వేల అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించి దేశభక్తిని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ప్రతి ఇళ్లు, దుకాణంపై జాతీయ జెండా ఎగరవేయాలంటూ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో త్రివర్ణ పతాకాల ప్రదర్శన ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం గ్రామ వీధుల్లో జాతీయ స్ఫూర్తి వెల్లి విరిసింది. విద్యార్థుల ర్యాలీలు, నినాదాలతో వీధులు మార్మోగాయి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. పెనుకొండలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి అవుట్ డోర్ స్టేడియం వరకు త్రివర్ణ పతకాలతో విద్యార్థుల ర్యాలీ కొనసాగింది. ఎమ్మిగనూరులో వంద అడుగుల జాతీయ జెండాతో సోమప్ప కూడలి వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి పురపాలక సంఘం పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులు మిషన్ కాంపౌండ్ నుంచి బెంగళూరు బస్టాండ్ మీదుగా అనిబిసెంట్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు. అనంతరం భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగరాలి : సీఎం చంద్రబాబు - CBN on Har Ghar Tiranga