Gudisa Hill Station in East Godavari District : పుష్ప సినిమా అనగానే హీరో అల్లు అర్జున తర్వాత ఎర్ర చందనం తరలించే సీన్లు, అందమైన అడవులు గుర్తొస్తుంటాయి. పుష్ప సినిమాలో పెద్ద కొండపై జెర్రిపోతులా మెలికలు తిరిగిన ఒక దారిని గమనించే ఉంటారు. ఈ సారి సరదాగా విహార యాత్ర ప్లాన్ చేస్తే ఆ ప్రదేశాన్ని కవర్ చేసేలా జాబితాలో చేర్చేసుకోండి అంటున్నారు ప్రకృతి ప్రేమికులు.
పుష్ప సినిమాలో అడవులు, ఎర్ర చందనం చెట్లు, వాహనాలు వెళ్లే దారులు ఆసక్తి గొల్పుతుంటాయి. ఈ సినిమా ఎక్కువ భాగం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించగా అక్కడి ప్రకృతి చిత్రాలు కాన్వాసును తలపిస్తాయి. ముఖ్యంగా ఓ సీన్‌లో చూపించే పెద్ద కొండపై జెర్రిపోతులా మెలికలు తిరిగిన రోడ్డును గమనించే ఉంటారు. దట్టమైన అడవి మధ్యలో ఎత్తైన కొండపై మెలికలు తిరిగే ఎర్రమట్టి దారి ఎన్నో అనుభూతులను కలిగిస్తుంది. ఆ ప్రాంతానికి వెళ్తే మర్చిపోలేని అనుభూతులు మూటకట్టుకోవడం గ్యారెంటీ. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. మేఘాలను తాకే కొండలను చేరారంటే ఆకాశంలోని కారు మబ్బులు, దట్టమైన పొగమంచు మీ తనువును స్పృశిస్తూ ఉంటాయి.
స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే!
తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలోని ఆ ప్రాంతమే "గుడిస" హిల్‌స్టేషన్. హైదరాబాద్ నుంచి దాదాపు 420 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుడిస హిల్ స్టేషన్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సొంత వాహనంలో కొండపైకి చేరుకోవచ్చు లేదా అక్కడ వాహనాలు, జీపులను అద్దెకు తీసుకొని వెళ్లొచ్చు. భోజన, వసతి సదుపాయాలు తక్కువే అయినా కొన్ని ప్రైవేటు సంస్థలు రిసార్టులు ఏర్పాటు చేసి అద్దెకిస్తున్నాయి. ప్రయాణం కఠినమే అయినప్పటికీ సాహస ప్రయాణం, ప్రకృతి అందాలను ఇష్టపడే స్నేహితులు, జంటలు ఈ యాత్రకు సిద్ధమైపోవచ్చని పర్యటకులు చెప్తున్నారు.
ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పరిధిలోని వంజంగి కొండలు సైతం పర్యటకులకు మధుర జ్ఞాపకాలు పంచుతున్నాయి. ఘాట్ రోడ్లో ప్రయాణంతో పాటు స్వచ్ఛమైన గాలిలో మైమరచిపోవచ్చు. సెల్ఫోన్లలో ప్రకృతి అందాలను బంధిస్తూ సమయం ఇట్టే గడపొచ్చు. ముఖ్యంగా శిఖరం పైనుంచి కనిపించే మబ్బులు మిమ్మల్ని మరోలోకం లోకి తీసుకెళ్తాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రకృతి రమణీయ దృశ్యాలకు మారేడుమిల్లి అటవీ ప్రాంతం, వంజంగి కొండలు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు.