Govt Employees Association Meeting: ఉద్యోగ సంఘాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏపి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఐక్య వేదిక ఆధ్వర్యంలో బందరు రోడ్డులోని ఎంబి భవన్ లో ఉద్యోగల సమావేశం నిర్వహించారు. అయితే, ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఎన్నికల అధికారులు ఉద్యోగులకు తెలిపారు. ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయమని లిఖితపూర్వకంగా హమీ ఇస్తేనే తాము సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. దీంతో ఐక్య వేదిక ప్రతినిధులు ఎన్నికల అధికారులకు లిఖితపూర్వక హమీ ఇచ్చారు.
ఎన్నికల కోడ్‌తో సంబంధం ఏంటి ? - ఉద్యోగ సంఘాలపై బొత్స, సజ్జల చిరాకు
ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు అడుగులు వేస్తున్నామని, తమ కృషి ఫలితంగా 30 సంఘాలు ఈ ఐక్యవేదిక భాగస్వామ్యం అయ్యాయని సూర్యనారాయణ తెలిపారు. సీపీఎస్ రద్దు చేస్తారా? ఒపీస్ అమలు చేస్తారా అన్నది ప్రశ్నగా మారిందన్నారు. ప్రభుత్వం మాత్రం జీపీఎస్ ను అమలు చేయాలని చూస్తుందని, దీనికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకమన్నారు. పీఅర్సీ పై శాస్త్రీయ విధానంలో చర్చ చేయటం లేదని అభిప్రాయపడ్డారు. నిర్ధిష్టమైన చట్టం ద్వారా పీఅర్సీ అమలు చేయాలన్నారు.
ఉద్యోగుల సమస్యలపై సంఘాల మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల ప్రయోజనాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. గ్రామ సచివాలయల ఉద్యోగుల సర్వీస్, పదోన్నతులు, బదిలీలు పై ఇంకా అవగాహన కుదరలేదని చెప్పారు. తమ సమస్యలపై ఎవరు ప్రభుత్వంతో మాట్లాడాలనే అంశంపై ఉద్యోగులకు ఓటింగ్ పెట్టాలని, అప్పుడే సంఘాల్లో బాధ్యత పెరుగుతుందన్నారు.
'ఉద్యోగ సంఘాల నాయకులు భాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకు వచ్చిన ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండలేకపోతున్నాయి. అన్ని సంఘాలు భజనతో కాకుండా భాధ్యతలతో పరిష్కారం తీసుకువచ్చే దిశగా పోరాడాలి. అందు కోసమే ఐక్య వేదిక ఏర్పాటు చేశాం. ఉద్యోగులను చైతన్య పరిచేందుకు జిల్లాల వారిగా ప్రచారం చేస్తున్నాం. సమస్యల పరిష్కారం దిశగా ఏ వింధగా ముందుకు సాగాలనే అంశంపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నాం. ప్రధానంగా, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ కోసం పోరాడాలని నిర్ణయించాం. కేవలం లక్ష, రెండు లక్షల ఉద్యోగుల కోసం మా పోరాటం చేయడం లేదు, భవిష్యత్తులో ఉద్యోగాల్లో చేరబోయే ఉద్యోగుల కోసం సైతం పోరాడుతున్నాం.'- కెఆర్ సూర్యనారాయణ, ఐక్యవేదిక చైర్మన్
ఉద్యోగుల ఓట్ల కోసం డీఏల ఎర - పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం జగన్ నటన