Government to Provide Alternative Sites to R-5 Zone Beneficiaries : రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం ఆర్ - 5 జోన్ పేరిట మంజూరు చేసిన ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోనే వారికి స్థలాలు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం 43,286 మందికి స్థలాలు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టింది.
అక్కడ ఇళ్ల స్థలాల కేటాయింపు చెల్లదు : అమరావతి ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాల లబ్ధి దారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ఆర్ 5 జోన్లో ఇళ్ల స్థలాల కేటాయించింది. అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు చెల్లదని కోర్టు తీర్పు మేరకు ఆర్ 5 జోన్లో కేటాయింపు నిలిచిపోయింది. వాస్తవానికి 50,793 మందిలో 7,506 మంది అనర్హులని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుర్తించింది.
సొంత జిల్లా ఇంటి నిర్మాణం : గుంటూరు జిల్లా కి చెందిన 23,762 మంది లబ్ధిదారుల్లో 4,323 మంది అనర్హులు అని అధికారులు తేల్చారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,301లో 3,183 మంది అనర్హులు ఉన్నట్లు వారు గుర్తించారు. ఇప్పుడు మిగిలిన 43,286 మంది లబ్ధిదారులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాల కేటాయించి టిడ్కో ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రూ.1500 కోట్లు వెచ్చించాలని నిర్ణయం : ఎన్టీఆర్ జిల్లాలో 265 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 216 ఎకరాలు ఇళ్లు నిర్మాణానికి అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ భూసేకరణకు, టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం రూ.1500 కోట్లు ప్రభుత్వం వెచ్చించాలనీ నిర్ణయం తీసుకుంది.