Government discussion with employees: ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చేపట్టిన చర్చలు ముగిశాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చలు జరిపింది. పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత కొంత కాలంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాల్సిన అంశాలపై మంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు.
20 వేల కోట్ల బకాయిలు: ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత బకాయిలు పడిందో ఈ సమావేశం లో తెలుసుకోగలిగామని ఏపి జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. 600 కోట్ల రూపాయలు ఏపి జీ ఎల్ ఐ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కూడా 2500 కోట్ల మేర చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సరెండర్ లీవ్ బకాయిలు 2600 కోట్ల రూపాయల బకాయిలు, పోలీసులకు ఉన్న రూ. 300 కోట్లను మార్చి 31 నాటికి చెల్లిస్తామనే హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రూ.5,600 కోట్ల మేర బకాయిలు లిస్టు సమావేశం లో ఇచ్చారని చెప్పారు. మొత్తం ఉద్యోగులకు డీఏ బకాయిలు 7500 కోట్ల రూపాయల మేర ఉందని, వెరసి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పడిన మొత్తం రూ.20 వేల కోట్లుగా ఉందని వెల్లడించారు. ఆఫీసు నిర్వహణ, ప్రోటోకాల్, 2019 ఎన్నికల బడ్జెట్, లీగల్ వ్యవహారాల డబ్బులు కూడా ప్రభుత్వం బకాయి పడిందని బొప్పరాజు వెల్లడించారు.
ఐదో తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు : ఏపీటీఎఫ్
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులక వేతనం పెంచాలి: కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దికరణకు తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుల మ్యాపింగ్ కాలేదని క్రమబద్దికరణ చేయడం లేదన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం పెంచాలని తాము కోరామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డు కూడా పనిచేయడం లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ట్రస్టుకు ఇచ్చేలా ఉత్తర్వులు వచ్చినా అది అమలు కావడం లేదని చెప్పారు. మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్ చేయాలని కోరామన్నారు.
50 లక్షల పరిహారం: ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై చర్చించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పీఆర్సీ త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల మధ్యంతర భృతిపై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామని వెల్లడించారు. తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్నీ 50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వనున్నట్లు బొత్స తెలిపారు.
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - రేపు మంత్రుల బృందం భేటీ
27న చలో విజయవాడ: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిరుత్సాహ పరిచిందని ఏపి ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు విమర్శించారు. తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మధ్యంతర భృతి చెల్లింపు విషయం లో ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ నెల 14 తేదీన నల్ల బాడ్జీలతో మొదలయ్యే ఉద్యోగుల ఆందోళన 27న చలో విజయవాడతో ముగుస్తుందని వెల్లడించారు. ఈ చర్చల్లో ఏపీజేఎసీ అమరావతి నేత బొప్పరాజు, ఏపీఎన్జీఓ నుంచి బండి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, ఉద్యోగుల ఫెడరేషన్ నుంచి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.