Government Special Threepronged Strategy Against Illegal Mining : పర్మిట్లు నామమాత్రంగా తీసుకొని భారీగా ఖనిజాన్ని తరలించడం, అసలు పర్మిట్లే లేకుండా అక్రమ రవాణా, నంబరు ప్లేట్లు మార్చేసిన వాహనాల్లో ఖనిజం తరలింపు, జీఎస్టీ ఎగవేత ఇలా గనుల లీజుదారులు చేస్తున్న అక్రమాలెన్నో. వాణిజ్య పన్నుల శాఖ అంచనా ప్రకారం ఎటువంటి ఫీజులూ చెల్లించకుండా తరలిస్తున్న గ్రానైట్‌తో ప్రభుత్వం రోజుకు సగటున రూ.3 కోట్ల మేర రాబడి కోల్పోతోంది. ఇటువంటి వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అన్ని అంశాలపై పటిష్ఠ నిఘా పెట్టేందుకు వాణిజ్య పన్నులు, గనులు, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించింది. ప్రతి టన్ను/క్యూబిక్ మీటరు ఖనిజం తరలించాలంటే అన్ని అనుమతులు తీసుకొని, ఫీజులన్నీ సక్రమంగా చెల్లించేలా చూసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. తాజాగా ఈ మూడు శాఖల ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి, ఎలా సమన్వయం చేసుకోవాలనే దానిపై చర్చించారు. వెంటనే కార్యాచరణ ఆరంభించాలని నిర్ణయించారు.
డ్రోన్లతో ఖనిజ పరిమాణం లెక్కలు
- ప్రతి లీజులో డ్రోన్ టెక్నాలజీ వినియోగించి డ్రోన్లతో తరచూ తనిఖీలు నిర్వహించి, 3డీ చిత్రాలు తీస్తారు. వీటి ద్వారా జియోకోఆర్డినేట్స్ తెలుస్తాయి. కొంతకాలం తర్వాత మళ్లీ డ్రోన్‌తో సర్వే చేసి 3డీ చిత్రాలు తీసి అంతకు ముందు తీసినవాటితో బేరీజు వేస్తారు. తద్వారా ఆ లీజులో ఎంత ఖనిజం తవ్వారనేదీ అంచనా వేస్తారు. ఈ మేరకు లీజుదారులు పర్మిట్లు తీసుకున్నారా, లేదా అనేది పరిశీలిస్తారు.
- పర్మిట్లు సక్రమంగా తీసుకోకపోతే చర్యలు చేపడతారు. డ్రోన్లతో సర్వేకు డ్రోన్ కార్పొరేషన్ సహకారం తీసుకుంటారు.
- రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పక్కన ఉండే వేబ్రిడ్జిలను గనుల శాఖ ఆన్‌లైన్ పర్మిట్ల జారీ పోర్టల్‌తో అనుసంధానం చేస్తారు. ప్రతి లీజుదారూ తన లీజు ప్రాంతం నుంచి ఖరారుకాని ట్రాన్సిట్ ఫామ్‌తో వేబ్రిడ్జి వద్దకు వెళ్తారు. అక్కడ తూకం వేయించి, ఖనిజం ఎంత బరువు ఉందో ఖరారు చేసుకొని, ఆ మేరకు గనులశాఖ నుంచి ఆన్‌లైన్‌లో ట్రాన్సిట్ ఫాం పొందేలా చూస్తారు.
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు - గనుల శాఖ ఉత్తర్వులు
- ఇందుకోసం వే బ్రిడ్జిలన్నీ గనులశాఖ పోర్టల్‌తో అనుసంధానించేలా చూసే బాధ్యతను తూనికలు, కొలతల శాఖకు అప్పగించనున్నారు.
- గనులు, వాణిజ్య పన్నులు, రవాణా శాఖల పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తారు. రవాణాశాఖకు చెందిన వాహనాల సమాచారం వాహన్ పోర్టల్ ద్వారా తీసుకుంటారు.
- గనుల శాఖ ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేసే సమయంలోనే లీజుదారు సరైన జీఎస్టీ నంబరును పేర్కొన్నారా లేదా అనేది పరిశీలిస్తారు.
- ఖనిజాన్ని తరలించే వాహనానికి పర్మిట్, ఫిట్‌నెస్ తదితరాలు ఉన్నాయా? లీజుదారు పేర్కొన్న వాహన వివరాలు సరైనవేనా అనేది రవాణాశాఖ పోర్టల్‌లో చూసి, ఖరారు చేస్తారు.
- ఖనిజ లోడుతో వెళ్లే వాహనాల జీపీఎస్ ఆధారంగా లీజుదారు పర్మిట్ పొందేటప్పుడు పేర్కొన్న చోటికే ఖనిజాన్ని తరలిస్తున్నారా ఇతర ప్రాంతాలకు దారి మళ్లిస్తున్నారా అనేది పరిశీలిస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 14 వేల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఖనిజ రవాణా చేసే వాహనాలు దారి మళ్లకుండా ఈ సీసీ కెమెరాల సాయం తీసుకోనున్నారు. అలాగే మైనింగ్ ప్రాంతాల నుంచి వాహనాలు రోడ్లపైకి వచ్చే మార్గాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆ నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - 100కోట్ల కుచ్చుటోపి - సీఐడీకి కేసు బదిలీ