AYUSH Commissioner Harassment on Employees : రాస్కెల్స్, యూ స్క్రౌండల్, బాస్టర్డ్, యూజ్‌లెస్ ఫెలోస్ వంటి పరుష పదజాలంతో ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్.బి. రాజేంద్రకుమార్ వైద్యులు, ఉద్యోగులను మానసికంగా వేధించారు. విధుల నిర్వహణలో ఆయన వ్యవహారశైలితో ఉద్యోగులు, వైద్యులు బెంబెలెత్తిపోయ్యారు. వీరిని అనరాని మాటలతో రాచిరంపాన పెట్టారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల విషయంలో వారిని ఇబ్బందిపెట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాజేంద్రకుమార్‌ను బదిలీచేస్తూ, ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ఉద్యోగుల పాట్లు అన్నీఇన్నీ కావు : నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి ఆయుష్ కమిషనర్‌గా వ్యవహరిస్తూ వచ్చిన రాజేంద్రకుమార్ విధుల వ్యవహారశైలిపై ప్రభుత్వానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. విధుల నిర్వహణలో ఉన్నప్పుడు వైద్యులు, ఉద్యోగులపై అయినదానికీ కాని దానికీ అనుచిత వ్యాఖ్యలతో సిబ్బందిని ఠారెత్తించారు. ఈయన కొద్దికాలం ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టరుగా వ్యవహరించిన సమయంలోనూ ఉద్యోగులను వేధించారు. గత జులైలో ఎయిడ్స్ నియంత్రణ శాఖకు చెందిన 160 మంది ఉద్యోగులు 300 పేజీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అంతేకాకుండా ఆయుష్ వైద్యుల్లో కొందరు కుమార్ వ్యవహారశైలిపై మంత్రులు, ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఫిర్యాదుచేశారు. వీటిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నిఘా విభాగం కూడా విచారణ జరిపి, రాజేంద్రకుమార్‌ను వెంటనే బదిలీచేయాలని నివేదించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజేంద్రకుమార్‌పై బదిలీ వేటుపడింది.
మాట వినకపోతే బలవంతంగా బదిలీలు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో రాజేంద్రకుమార్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో మందుల కొనుగోళ్ల వ్యవహారం దుమారాన్ని రేకెత్తించింది. అవసరం లేకున్నా ముందస్తుగా మందులు కొనాలని స్థానిక ఆసుపత్రులకు ఆదేశాలివ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పించి, ఆయుష్‌కు పంపింది. అప్పుడే కొద్దికాలం ఎయిడ్స్ నియంత్రణ మండలి బాధ్యతలను రాజేంద్రకుమార్ నిర్వర్తించారు. ఆ సమయంలో రాజేంద్రకుమార్ వ్యవహరంపై ప్రభుత్వానికి ఉద్యోగులు తమతమ ఫిర్యాదుల్లో తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. రాజేంద్రకుమార్ విధుల నిర్వహణలో అనైతికంగా వ్యవహరించారని, అసభ్యకర పదాలు వాడారని, కనీసం గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం ఫండమెంటల్ హక్కులను కూడా కాలరాచరని, తన మాట వినడంలేదని ఉద్యోగులను బలవంతంగా బదిలీలు చేశారని, ఉద్దేశపూర్వకంగా వేతనాల చెల్లింపుల్లో జాప్యంచేశారని ఉద్యోగులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
సమావేశాల్లోను పరుష పదజాలం : కొద్దికాలం కిందట విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన హెచ్‌ఐవీ కౌన్సెలర్ల శిక్షణ కార్యక్రమంలో ఉద్యోగులను ఆయన వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో దూషించారు. జూం కాన్ఫరెన్స్ సమావేశాల్లో అకారణంగా పరుష పదాలను తరచూ వాడుతున్నారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మరింత ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. పలువురు ఉద్యోగినులూ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు అని ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులో ఉద్యోగసంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. వీటిపై విచారణకు సాధారణ పరిపాలన శాఖ గత జులై 20న వైద్య ఆరోగ్య శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యంగా సెలవుల్లాంటి విషయాల్లో ఉద్యోగులను అనవసరంగా విజయవాడకు పిలిపించి, గంటలకొద్దీ వేచి ఉండేలా చేసి, మందలింపు పేరుతో వారిని ఆ అధికారి నానా మాటలు అన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వస్తువులను నేలకేసి కొడుతూ : ఈయన వ్యవహారశైలిపై అందిన ఫిర్యాదులపై శాఖాపరమైన విచారణ కూడా సాగింది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా అడిగితే వ్యవస్థాగత మార్పులతో అధికారులు, ఉద్యోగులు, వైద్యుల్లో మార్పులు తెస్తున్నానని చెబుతూ ఎదుటి వారిని నమ్మించేలా చెప్పడంలో రాజేంద్రకుమార్ ఆరితేరారంటారు. చేతిలో ఉన్న వస్తువులను నేలకేసి కొట్టేవారని కూడా ఉద్యోగులు చెప్పారు. మహిళలు ఈయన వ్యవహారశైలి గురించి ఉన్నతాధికారులు, మంత్రుల వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.
Ayush On Omicron: ఆ మందుకు అనుమతి లేదు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఆయుష్‌శాఖ
తక్కువ ధర - ఎక్కువ మొత్తంలో బిల్లులు : రాజేంద్రకుమార్ హయాంలో జరిగిన డిప్యుటేషన్‌లు, బదిలీలు, పలు డిప్యుటేషన్‌ల రద్దు వెనుక ‘ఆయుష్’ ప్రధాన కార్యాలయంలో పెద్దతతంగం చోటుచేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 4 జోనుల్లో ఇద్దరు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్లు ఆయుర్వేద, ఒకరు యూనాని, మరొకరు హోమియో విభాగం నుంచి ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అధిక ధరలకు ఫర్నిచర్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, బీరువాలు, ఇతర కొనుగోళ్లకు తక్కువ ధరతో కొనుగోలుచేసి, ‘ఖాదీబండార్’ పేరుతో ఈ మధ్యకాలంలో ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టారని, దీనికి ఇద్దరు సహకరిస్తుంటారని చెబుతున్నారు.
అడుగడుగునా అక్రమాలు : అలాగే మందు కొనుగోళ్లు, నిర్మాణాలు చేపట్టడంలోనూ నిబంధనలు అనుసరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయంతో నిమిత్తం లేకుండా జిల్లాల్లోనే కొనుగోళ్లు జరిగాయని చెప్పేలా వాతావరణాన్ని సృష్టించి, లబ్ధిపొందడంలో ‘ఆయుష్’ ప్రధాన కార్యాలయం ఆరితేరింది. ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా కాకుండా ఆయుష్ ద్వారా నేరుగా కొనుగోళ్లు, నిర్మాణాలు చేపట్టడం వంటి వ్యవహారాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ ద్వారా విచారణ జరిపిస్తే అనేక వాస్తవాలు వెలుగులోనికి వస్తాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోపక్క ఆసుపత్రులు, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాల ద్వారా జరగాల్సిన వేతనాల చెల్లింపు వ్యవహారాలను విజయవాడకు మార్చడంతో వైద్యులు, ఉద్యోగులు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. నిఘా విభాగం నుంచి ప్రభుత్వానికి అందిన నివేదికలోనూ ఆయుష్‌లో ఇటీవల జరిగిన అక్రమాల గురించి కూడా పేర్కొన్నట్లు తెలిసింది.
ఆనందయ్య మందుతో కొవిడ్ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదు: ఆయుష్ కమిషనర్