Government Released Material Funds to Sarpanches: ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బిల్లులు చెల్లింపులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్థికశాఖల అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. ముగ్గురు ఉన్నతాధికారులతో వేసిన కమిటీ అనుమతి కూడా లేకుండానే బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మెటీరియల్ పనులు నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి గత ఏడాది నవంబరు నుంచి 12 వందల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధిక పంచాయతీల్లో వైఎస్సార్సీపీవారే సర్పంచులు. ఎన్నికల్లో పార్టీ కోసం నాలుగు రూపాయలు ఖర్చు చేయాలంటే పెండింగ్ బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేయాలని పలువురు సర్పంచులు ఇటీవల ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు విడుదల చేసేలా చూడాలన్న 'పెద్దల' ఆదేశాలతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు కొద్ది రోజుల క్రితం దిల్లీకి కూడా వెళ్లారు. రెండు రోజుల క్రితం పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేంద్రం 12 వందల కోట్ల వరకు విడుదల చేసింది.
'రెండు రోజుల్లో నిధులు విడుదల చేయాలి'- కమిషనరేట్‌ను ముట్టడిస్తామని సర్పంచ్ల హెచ్చరిక - sarpanches fire on ycp government
మెటీరియల్ పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో గతంలో ఎప్పుడూ కనబరచని ఉత్సాహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్థికశాఖలు ప్రస్తుతం చూపిస్తున్నాయి. బిల్లులకు సంబంధించి సెకండ్ సిగ్నేచర్‌తో ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు తక్షణమే అప్‌లోడ్ చేయాలని జిల్లా అధికారులకు గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లడం, శనివారం సాయంత్రానికి ఆర్థికశాఖ 400 కోట్లకు పైగా బిల్లులు చెల్లించడం చకచకా జరిగిపోయాయి.
ఎఫ్‌టీవోలు అప్‌లోడ్ చేసిన మిగతా బిల్లులూ సోమవారంలోగా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెటీరియల్ పనుల పెండింగ్ బిల్లుల చెల్ల్లింపుల్లో ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంత శ్రద్ధ చూపలేదు. కేంద్రం నిధులిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడుకుని ఎప్పుడో చెల్లించేవారు. దీనిపై వైసీపీ సర్పంచులూ ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు సరిగా విడుదల చేయకుండా విద్యుత్తు ఛార్జీలకు మళ్లించింది.
2023-24 సంవత్సరానికి సంబంధించి కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 998 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. రాష్ట్ర ఆర్థికశాఖకు కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారం 14 రోజుల్లోగా పంచాయతీ బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. జాప్యంపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆర్థికశాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇప్పటికీ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. 'మెటీరియల్' పనుల నిధుల విషయంలో మాత్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఈ పనులు చేయించిన వారిలో వైసీపీ సర్పంచులతోపాటు ఆ పార్టీ గ్రామ స్థాయి నాయకులు ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.
పంచాయతీ నిధులు మళ్లీ పక్కదారి - రూ.988 కోట్ల దారి మళ్లింపు - Panchayat Funds