Heavy Rains and Floods in AP : ముంపు బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేపట్టడం సహా సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారని తెలిపింది.
రాష్ట్రంలో ఇంతవరకు భారీ వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతి చెందారని వెల్లడించింది. ఇద్దరు గల్లంతయ్యారని పేర్కొంది. 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని తెలిపింది. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించినట్లు వివరించింది. అధిక వర్షాల కారణంగా 1808 కి.మీ పొడవున ఆర్& బీ రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. లక్షా72,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగాయని వెల్లడించింది.
19 People Died in Floods in AP : ప్రకాశం బ్యారేజి వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 41 వేల 927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించామని, 171 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని పేర్కొంది. సహాయక చర్యల్లో 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నాయని తెలిపింది. భాదితులకు నేడు 3లక్షల ఆహార ప్యాకేట్లు, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. 188 బోట్లును, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపింది. ఎటువంటి సహాయనికైన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది.
చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష : వరద సహాయ చర్యల పురోగతిపై విజయవాడ కమాండ్ కంట్రోల్ రూం నుంచి సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు సహా ఉన్నతాధికారులంతా వరద సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద సహాయచర్యలపై మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో వార్డుల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ ఉదయం నుంచి వరద ముంపు ప్రాంతాల్లో హెలీకాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, నీళ్ల సీసాలు, మందులు అందజేశారు. వరద ప్రవాహంలో చిక్కుకుని గల్లంతైన ఇబ్రహీంపట్నం లైన్‌మెన్, మరో మహిళ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.