Government on Registration Value in AP : రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలను త్వరలో పెంచేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నారు. సాధ్యమైనంత వరకు 10 శాతం నుంచి 15 శాతం మధ్యనే పెంపుదల ఉండొచ్చు.
శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాలవారీగా రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై నిర్ణయాలు జరుగుతాయి. ఈ ప్రక్రియకు కనీసం 45 రోజుల సమయం పడుతుంది. పెంపు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదించాక అధికారిక నిర్ణయం వెలువడుతుంది. ప్రస్తుతం కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగాను, బహిరంగ మార్కెట్ విలువను తక్కువగాను ఉన్నాయి. వీటిని సరిదిద్దుతారు.
ఈ చట్టంతో మీ భూములకు కొత్త సమస్యలు! - AP LAND TITILING ACT 2023
నివేదికలు అందిన తర్వాత సీఎం చంద్రబాబు ఆమోదం : వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతారు. వైఎస్సార్సీపీ పాలనలో 2019లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 20 శాతం అలాగే 2020లో ఎంపిక చేసిన పట్టణాల్లో 10 నుంచి 20 శాతం, 2022లో జిల్లా కేంద్రాల్లో 20 శాతం, 2023లో జాతీయ రహదారులు, ఎంపిక చేసిన ప్రదేశాల్లో 20 శాతం వరకు విలువలు పెంచారు. నివేదికలు అందిన తర్వాత సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన మేరకు రిజిస్ట్రేషన్ విసువల పెంపునకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలకు ఆదేశాలు వెళ్తాయి.
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు : గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ల విధానం రద్దుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ విధానానికి క్రయ, విక్రయదారుల నుంచి స్పందన తక్కువగా ఉంది. గడిచిన రెండేళ్లలో సుమారు 3 వేల 700 గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభించగా ఇప్పటివరకూ 5 వేల రిజిస్ట్రేషన్లే జరిగాయి. వీటి వల్ల అదనంగా ఖర్చు, మానవ వనరుల వృథాతో పాటు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించారు.
నిధుల విడుదలకు చంద్రబాబు అంగీకారం : ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధానానికి చంద్రబాబు స్వస్తి పలికారు. ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ, విక్రయదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు 10 కోట్ల రూపాయలు అవసరమని ఐజీ శేషగిరిబాబు ప్రతిపాదించగా నిధుల విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు.