Government on Diarrhea Death Cases in Dachepalli : పల్నాడు జిల్లా దాచేపల్లిలో అతిసారం లక్షణాలతో ఇద్దరు మృతి చెందడం మరో 8 మంది ఆస్పత్రుల పాలవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డయేరియా ప్రబలకుండా వెంటనే జిల్లా అధికారులు, స్థానిక సిబ్బంది కట్టడి చర్యలు చేపట్టారు. డయేరియా వ్యాప్తికి కలుషిత నీరే కారణమని గుర్తించిన అధికారులు, కాలనీ వాసులకు సురక్షిత నీరు సరఫరా చేస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు సేవలు అందిస్తున్నారు.
ఆస్పత్రుల్లో 8 మంది : ఐదు సంవత్సరాల కాలంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాగు నీటి సరఫరా వ్యవస్థను, పారిశుద్ధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేయడం నేడు ప్రజల ఆరోగ్యం పాలిట శాపంలా మారింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పైపు లైన్లు లీకేజీ వల్ల తాగు నీరు కలుషితమై వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. పట్టణంలో గత కొంతకాలంగా పారిశుద్ధ్యం నిర్వహణ పూర్తిగా పడకేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం, తాగు నీటి వల్లే కాలనీ వాసులు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డయేరియా పంజా - రెండ్రోజుల్లో ఐదుగురు మృతి - సీఎం చంద్రబాబు ఆరా
డయేరియా కట్టడి చర్యల గురించి చంద్రబాబు ఆరా : డయేరియా లక్షణాలతో దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో ఇద్దరు మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒకవైపు పారిశుద్ధ్య పనులు చేపడుతూనే, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించింది. నీటి నమునాలను సేకరించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. బాధిత కాలనీలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టణంలోని డయేరియా వ్యాప్తి గురించి ఆరా తీశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం కలెక్టర్‌కు ఫోన్ చేసి డయేరియా కట్టడి చర్యల గురించి వాకబు చేశారు.
మంత్రి సత్యకుమార్ పర్యటన : దాచేపల్లిలో ప్రస్తుతం డయేరియా పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. జిల్లా వైద్యాధికారులు ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నేడు దాచేపల్లి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు.
గుర్లలో పవన్ కల్యాణ్ పర్యటన - మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం