Vehicle Registration in AP : 'మన రాష్ట్రం వారు పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనుక్కుని' వాటిని ఏపీకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే ఇకపై కుదరదు. ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని వివిధ నగరాల్లో కొత్త కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఆయా వాహనాల ద్వారా ఏటా జీఎస్టీ రూపంలో దక్కాల్సిన రూ.100 కోట్ల వరకు రాష్ట్రం నష్టపోతోందని వాణిజ్య పన్నులశాఖ నిర్ధారించింది. దీంతో వీటిని పూర్తిగా కట్టడి చేయడానికి రవాణాశాఖ సమాయత్తమైంది.
సగం జీఎస్టీ కోల్పోతూ : ఓ వాహనాన్ని కొన్నప్పుడే దాని విలువ ఆధారంగా జీఎస్టీ, జీవిత పన్ను తదితరాలు 18 నుంచి 28 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఖరీదైన బైకులు, కార్లను కొనుగోలు చేసి అక్కడ 28 శాతం వరకు జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఆ రాష్ట్రంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఏపీకి ఆ వాహనాన్ని తీసుకొచ్చి జీవిత పన్ను చెల్లించి, శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.
జీఎస్టీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరి సగం వాటా ఉంటుంది. అందులో భాగంగా 28 శాతం జీఎస్టీలో సగం (14 శాతం) వాటా ఏపీకి దక్కాలి. ఉదాహరణకు పక్కరాష్ట్రంలోని షోరూమ్‌లో రూ.60 లక్షల విలువైన కారు కొనుగోలు చేశారని అనుకుందాం. అందుకు 28 శాతం జీఎస్టీ రూపంలో రూ.16.80 లక్షలు అక్కడే చెల్లిస్తున్నారు. అందులో రూ.8.40 లక్షలు కేంద్ర ప్రభుత్వానికి, మరో రూ.8.40 లక్షలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతున్నాయి. ఆ రూ.8.40 లక్షలను ఆంధ్రప్రదేశ్ నష్టపోతోంది.
ఇలా పక్క రాష్ట్రాల్లో ప్రతి నెలా వందల సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ఏపీ సర్కార్ ఏటా దాదాపు రూ.100 కోట్ల మేర రాష్ట్ర జీఎస్టీని కోల్పోతోంది. ఈ విషయమై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద వాణిజ్యపన్నులశాఖ అధికారులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇలా పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాలను ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని ఆయన గట్టిగా చెప్పారు.
డీలర్ల పరిధిపై దృష్టి : ప్రతి వాహన కంపెనీ వేర్వేరు ప్రాంతాల్లో నియమించుకున్న డీలర్లకు పరిధిని నిర్ణయిస్తుంది. ఓ నగరం, జిల్లా పరిధిని నిర్ణయించి అక్కడి వారికి మాత్రమే వాహనాలను అమ్ముకునేలా లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) ఇస్తుంది. ఆ డీలర్ ఇతర ప్రాంతాలవారికి వాహనాలను విక్రయించకూడదు. అయినాసరే పొరుగు రాష్ట్రాల్లోని డీలర్లు ఏపీ వారికి వాహనాలు అమ్ముతున్నారు. దీంతో అసలు ఆయా డీలర్లకు ఉన్న పరిధిపై రవాణాశాఖ ఆరా తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ చిరునామాను ఆధారంగా చూపించే వారికి పొరుగురాష్ట్రాల డీలర్లు వాహనాలు ఎలా విక్రయిస్తారని ప్రశ్నలు సంధించనున్నారు. ఇలా పక్క రాష్ట్రాల్లో కొన్న వాహనాలను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
నెలకు మించి నడపకూడదు : రవాణాశాఖ నిబంధనల ప్రకారం పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఏపీలో నెలకు మించి ఉండకూడదు. ఆ వాహనాలను ఇక్కడే వినియోగించుకోవాలనుకుంటే దానికి మొదట రిజిస్ట్రేషన్ జరిగిన పొరుగు రాష్ట్రంలో నిరభ్యంతర ధ్రువపత్రం తీసుకొచ్చి, ఏపీ రవాణాశాఖకు జీవిత పన్ను చెల్లించి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఇలా పొరుగు రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలు ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరాలు తరబడి దర్జాగా తిరుగుతున్నాయి. మరోవైపు ముఖ్యంగా తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను ఇక్కడ శాశ్వతంగా వినియోగిస్తున్నారు. అయినా రవాణాశాఖ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు గడువు పొడిగింపు