Godavari Flood Water Level at Bhadrachalam : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముఖ్యంగా, భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగింది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం, తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటుగా, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నీటిమట్టం 53.2 అడుగులకు చేరుకుంది.
ఇక మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరి నీటిమట్టం 52.4 అడుగుల వద్ద ప్రవహించిన వరదనీరు క్రమంగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.2 అడుగులకు చేరడంతో అధికారులు చివరి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీలోని మురుగునీరు గోదావరిలో కలవడానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాలనీలోకి మురుగు నీరు చేరడంతో సుమారు 80 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
శుక్రవారం రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటి ప్రవహించటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. నీటిమట్టం 53 అడుగుల వరకు పెరగవచ్చని తెలిపారు.
శ్రీరాంసాగర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. జలశయానికి 27,850 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుత నీటినిల్వ 1073.60 అడుగులకు చేరుకుంది. శ్రీరాంసాగర్ నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం నీటినిల్వ 29.93 టీఎంసీలకు చేరుకుంది.
లంక గ్రామాల్లో గోదావరి వరదలు- ఆస్పత్రికి వెళ్లాలన్నా అష్టకష్టాలే - Patient Suffered Due to Floods
జూరాల : జూరాల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. 2.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 42గేట్ల ద్వారా 2.70లక్షల క్యూసెక్కుల నీరు కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నీటి మట్టం 318.51 మీటర్లకుగాను, 316.97 మీటర్లకు చేరుకుంది. జలశయానికి 9.65 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 6.67టీఎంసీలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయానికి నీటిప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను 506.60 అడుగుల నీరు నిండింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 125.97 టీఎంసీల నీటి నిలువలు ఉన్నాయి. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 52,199 క్యూసెక్కులు కాగా, 6,282 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
సింగూరు : సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత 14.066 టీఎంసీలుగా చేరుకుంది. సింగూరు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,595 కాగా, 391 క్యూసెక్కుల నీరు కిందికి వదలుతున్నారు.
శ్రీ పాద ఎల్లంపల్లి : శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు వస్తోంది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 16.91 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 14,349, కాగా, 331 క్యూసెక్కుల నీరును అధికారులు కిందికి వదులుతున్నారు.
స్వర్ణ జలాశయం : నిర్మల్ జిల్లా స్వర్ణ జలాశయానికి వరద నీరు చెరుతున్నాయి. ఎగువ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం కురియడంతో జలాశయానికి జలకల సంతరించుకుంది . జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1183 (1.484 టిఎంసి ) అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1180.5 (1.154 టిఎంసి ) అడుగులకు చేరింది. జలాశయంలలో 2700 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం రాత్రి 1 వరద గేట్ ద్వారా 1800 క్యూసెక్కుల నీటి విడుదల చేసారు.
శాంతించిన గోదారమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - Godavari Floods in Dhavaleswaram