Girls Game Changers in Video Gaming Industry : ఒకప్పుడు రయ్, రయ్‌మంటూ అబ్బాయిలు వీడియో గేముల్లో (Video Games) మునిగిపోతుంటే అందమైన బార్బీ బొమ్మ (Barbie Games)తో ఆడుకుంటూ మురిసిపోవడం అమ్మాయిల వంతు. ప్రస్తుతం ఆ అంతరం చెరిగిపోతోంది. వర్చువల్ గేమింగ్ (Virtual Gaming) అంటే కేవలం అబ్బాయిలదే అనుకునే రోజులు పోయాయి. గేమర్లుగా, క్రియేటర్లుగా మారే అమ్మాయిల సంఖ్యా ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరుగుతోందని తాజా సర్వేలు చెప్పే మాట. ఏ పనికి అయినా కావాల్సింది నైపుణ్యాలు, ప్యాషన్ మాత్రమే అంటూ అమ్మాయిలు ఈ-స్పోర్ట్స్ (E-SPORTS)లోనూ దూసుకెళ్తున్నారు.
గృహిణులూ పార్ట్ టైమ్ జాబ్‌గా గేమింగ్ : డాక్టర్, ఇంజినీర్ లాంటి వృత్తులనే కాదు, గేమింగ్ లాంటి కొత్త కెరియర్‌లకూ జై కొడుతున్నారు ఈ తరం అమ్మాయిలు. అలా అని వాళ్లంతా పెద్ద మెట్రో నగరాల్లో (Metro Cities) ఉండేవాళ్లే అనుకుంటే పొరపాటే. చిన్నచిన్న పట్టణాల్లోని అమ్మాయిలూ ముందుకు వస్తున్నారు. గృహిణులూ పార్ట్ టైమ్ జాబ్‌గా గేమింగ్‌ను ఎంచుకోవడం విశేషం. వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికాయ్ ప్రకారం మన దేశంలో మొత్తం 60 కోట్ల మంది గేమర్లు ఉంటే అందులో 41% మహిళలే. అందులోనూ నాన్- మెట్రో నగరాల నుంచి వచ్చిన వాళ్లు 66%.
నికో ఇండియా గేమర్ మార్కెట్ రిపోర్టు (Niko India Gamer Market Report) ప్రకారం- పీసీ గేమ్స్‌కి అమ్మాయిలు అబ్బాయిల కంటే అదనంగా 8.5 % ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి గేమర్లుగానే కాదు చాలామంది అమ్మాయిలు గేమింగ్ డెవలపర్లు, రైటర్లు, డిజైనర్లు, మేనేజ్‌మెంట్, కోచ్‌లు, షౌట్ కాస్టింగ్ లాంటి వాటిలోనూ సత్తా చాటుతున్నారు.
కారణాలు అనేకం : గేమింగ్ పరికరాలు అందుబాటు ధరల్లో రావడం, ఇంటర్నెట్ ఉపయోగం, ప్లాట్‌ఫామ్‌లు అధికం అవడం అన్ని ప్రాంతాలకీ విస్తరించడం, స్మార్ట్‌ఫోన్ వాడకం, వర్చువల్ విధానం వంటివి అన్నీ యువతను గేమింగ్ వైపు అడుగులు వేసేలా చేశాయి. కొవిడ్ తర్వాత చాలా ప్లాట్ ఫామ్‌లు విమెన్ గేమర్, ఈ- స్పోర్ట్స్ (E-SPORTS)ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కొన్ని సంస్థలు మహిళా గేమర్ల (Women Gamers) కోసం ప్రత్యేక టోర్నమెంట్లూ నిర్వహిస్తున్నాయి. అందులోనూ మహిళా గేమర్లు వాలోరెంట్, బీజీఎమ్‌ఐ (BGMI) వంటి టైటిల్స్‌లో అధికంగా ఉన్నారట.
మీరు వీడియో గేమ్స్ ఆడుతారా ఇతను తెలుసా మరి
మనవాళ్లు ప్రపంచ స్థాయిలో ఈ-స్పోర్ట్స్ (E-SPORTS)లో సత్తా చాటుతుండటం కూడా ఓ ముందడుగే. గత సంవత్సర లెక్కల ప్రకారం మన దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ విలువ 26 వేల కోట్ల రూపాయలు. దీన్ని బట్టి భవిష్యత్తులో ఎక్కువ మంది మహిళలు గేమింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్లుగా, ఈ స్పోర్ట్స్ ఛాంపియన్లుగా, డెవలపర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఛత్తీస్‌గడ్‌కు చెందిన 21 ఏళ్ల పాయల్ ధరే (Payal Dhare), నలభై ఏళ్ల వయసులో గేమింగ్ మొదలు పెట్టిన గృహిణి రీతూ సింగ్ (Ritu Singh), దిల్లీకి చెందిన సాక్షి సూద్ (Sakshi Sood), మోనికా జోసెఫ్ వంటివాళ్లు గేమర్లుగా, కంటెంట్ క్రియేటర్లుగా సత్తా చాటుతూ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
రూ.845కోట్ల కంపెనీగా తీర్చిదిద్దాం : సైకాలజీ చదివిన తాను గేమింగ్ రంగాన్ని ఎంచుకుంది విన్‌జో కో-ఫౌండర్ సౌమ్యసింగ్ రాథోడ్. 2016, 17సమయంలో డిజిటల్ రెవల్యూషన్ మొదలైందని, అందరూ ఇంటర్నెట్‌కు బాగా కనెక్ట్ అయ్యారని అన్నారు. 2018లో గేమింగ్ ప్లాట్‌ఫామ్ 'విన్‌జో'ను స్నేహితునితో కలిసి ప్రారంభించానని తెలిపారు. తొలినాళ్లలో రెవెన్యూ సృష్టించడం కష్టంగా అనిపించిందని, పెట్టుబడి, డిస్ట్రిబ్యూషన్, బ్రాండింగ్ సమస్యలు బాగా ఉండేవని పేర్కొన్నారు. మొదట్లో గేమ్ డెవలపర్లను తీసుకురావడమూ సులభంగా జరగలేదు. ప్రస్తుతం రూ.845కోట్ల కంపెనీగా తీర్చిదిద్దామని తెలిపారు. తమ సంస్థలోనూ 45 నుంచి 50 % అమ్మాయిలే ఉన్నారని, గేమింగ్‌ను కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంటే ఇదే మంచి సమయమని సూచించారు.
నచ్చిన పని చేయడానికి భయపడకూడదు : మనసుకు నచ్చిన పని చేయడంలో ఆనందం ఉంటుందని, ఆనందంతో పని చేస్తే విజయం సాధిస్తామని భీమవరం చెందిన గేమర్, కంటెంట్ క్రియేటర్ ఆది వైష్ణవి అంటున్నారు. చదువుకు సమయంలోనే గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని కోరిక ఉండేదని, చదువు పూర్తి అవగానే జాబ్ వచ్చేసిందని తెలిపారు. రోజూ సరదాగా గేమ్స్ ఆడేదాన్నని, కానీ వాటిల్లో పురుషాధిక్య కంటెంటే కనిపించేదని అన్నారు. దాంతో తానే ఎందుకు ఓ ఛానెల్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నానని గుర్తు చేశారు. ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్‌లో 'నటాషా గేమింగ్ (Natasha Gaming)' ప్రారంభించానని అన్నారు. ఇప్పుడు ఆరు లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారని అన్నారు. అటు ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూనే గేమర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా దూసుకెళ్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ రంగంలో అమ్మాయిలు పెరుగుతున్నారని, నచ్చిన పని చేయడానికి భయపడకూడదని, అప్పుడే ఏదైనా సాధించగలమని వెల్లడించారు.
వీడియో గేమ్స్ ఆడిన మోదీ- ప్రధాని ఆటకు గేమర్స్ కుడా ఫిదా! - PM Modi Play Video Games