Ganja Gang Arrested in Vijayawada: 35 కేసుల్లో నిందితుడు, పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అయినా తీరు మారలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్కు మకాం మార్చాడు. మైనర్లను లక్ష్యంగా చేసుకుని ముఠాలో చేర్చుకుంటాడు. వారితో నేరాలు చేయిస్తాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ వరుసగా ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్ చోరీలు చేస్తాడు. వాటిని తీసుకుని ఒడిశా ఏజెన్సీలో గంజాయి పండించే వారికి ఇస్తాడు. వారి నుంచి గంజాయి తీసుకుని హైదరాబాద్ చెక్కేస్తాడు. ఇది విజయవాడ నగరానికి చెందిన క్రిమినల్ కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చా నేర ప్రవృత్తి గురించి. ఒడిశా నుంచి హైదరాబాద్ కు 23 లక్షల విలువ చేసే గంజాయి తీసుకెళ్తూ పోలీసులకు రమేష్ గ్యాంగ్ అడ్డంగా దొరికింది.
దొంగతనాలు చేయటం వచ్చిన డబ్బుతో గంజాయి కొనుగోలు చేసి విక్రయించటం, పోలీసులు పట్టుకోగానే జైలుకు వెళ్లి రావటం మళ్లీ దందా కొనసాగించటం. ఇదే విజయవాడలోని వాంటెడ్ క్రిమినల్ కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చా స్టైల్. పోలీసులు తనపై నిఘా ఉంచారని తెలుసుకుని హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలో అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుంచే గంజాయి దందా కొనసాగిస్తున్నాడు. కొండా రమేష్ అలియాస్ చిన్నచిచ్చాపై విజయవాడ కమిషనరేట్ పరిధిలో 35 కేసులు న్నాయి. దొంగతనాలు, గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన కేసులే అధికం. గతంలో నగర బహిష్కరణ కూడా విధించారు. పలుమార్లు జైలుకు వెళ్లాడు.
'పుష్ప' తరహాలో గంజాయి తరలింపు - 912 కిలోలు స్వాధీనం - POLICE SEIZED GANJA
జైల్లో కొందరు నిందితులతో పరిచయం పెంచుకుని బయటకు రాగానే వారితో కలిసి నేరాలకు పాల్పడుతుంటాడు. మైనర్లను లక్ష్యంగా చేసుకుంటాడు. వారిని గంజాయి మత్తు రుచి చూపిస్తాడు. అనంతరం తనతో పాటు నేరాలు చేయించి తన ముఠాలో చేర్చుకుంటాడు. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్లో అడ్డా ఏర్పాటు చేసుకున్న రమేష్, రెండు నెలలకొకసారి ఒడిశా వెళతాడు. హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో వరుసగా ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు చోరీ చేస్తాడు. తాళం వేసిన దుకాణాల్లో దొంగతనాలు చేస్తాడు. దొరికిన వస్తువులను తీసుకెళ్లి ఒడిశా పరిధిలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు అప్పగించి వారి నుంచి గంజాయి తీసుకుంటాడు.
నర్సీపట్నం లాంటి ప్రాంతాల్లో దళారులకు వాహనాలను అప్పగిస్తారు. అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలను చేరుస్తారు. దొంగిలించిన వాహనాలను మల్కాన్ గిరి, చిత్రకోట పీఎస్ పరిధిలోని ఏజెన్సీ వారికి అప్పగించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా యాంటీ నార్కోటిక్ బృందం నిఘా ఉంచి నిందితుడు రమేష్ ముఠాను అరెస్ట్ చేసింది. మొత్తం 11మంది నిందితులను అరెస్ట్ చేయగా, వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. రమేష్ ముఠాతో పాటు ఒడిశాకు చెందిన కొందరు పనుల నిమిత్తం నగరానికి వచ్చారు. వచ్చేటప్పుడు కొంత గంజాయిని తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 23.5 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ కమిషనరేట్ పరిధిలో రెండు నెలల్లో 130 మందిని అరెస్ట్ చేసి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మైనర్లే లక్ష్యంగా విక్రయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రేతలు, వినియోగదారులపై నిఘా ఉందని డీసీపీ అన్నారు. గంజాయి పండిస్తున్న ఒడిశా ఏజెన్సీ ప్రాంత వాసుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని పంపి నిందితులతో పాటు బైక్లను స్వాధీనం చేసుకోనున్నారు.
అరకు టూ దిల్లీ - 22కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్ - Police Seized 22kg of Ganja