Gadwal Silk Sarees Selling on Online in Emmiganoor at Kurnool District : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తయారు చేసే గద్వాల పట్టుచీరలు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రాంతంలో కూడా పేరొందాయి. పట్టుచీరలు, సీకో, కాటన్ గద్వాల పట్టు చీరలు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా కోటబొమ్మలు, బుట్టలు, ఏనుగులు, పూలు తదితర అందమైన బొమ్మల అంచుల తయారీలో ఎమ్మిగనూరు చేనేత కార్మికులు సిద్ధహస్తులు. దశాబ్దాల క్రితం ప్రారంభమైన గద్వాల పట్టుచీరల వ్యాపారం ఇతర రాష్ట్రాల్లోనూ సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా గద్వాల పట్టుచీరలను ఆన్‌లైన్‌లో సైతం వ్యాపారులు అమ్ముతున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా చేసుకుని చీరలను విక్రయిస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యాపార వాటా 22% పైగా ఉందని వ్యాపారులు తెలియజేస్తున్నారు.
ఇక్కడి ప్రత్యేకతలు : ఎమ్మిగనూరులో తయారు చేసే గద్వాల్ పట్టుచీరలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చీరలకు కోటకొమ్మ చిత్రాలు, బుట్టా, ఏనుగు, జింక, ఇతర బొమ్మలతో అల్లికలతో పట్టుచీరలను నేస్తారు. ఇవి 32 అంగుళాల కొంగు డిజైన్, 32 అంగుళాల జాకెట్‌తో 700 నుంచి 750 గ్రాముల బరువు ఉంటాయి. ఎమ్మిగనూరులో తయారు చేసే పట్టుచీరలకు అంచులు ఐదించులు పెట్టి వాటికి బుట్టలు, ఇతర పూల డిజైన్లు వేస్తారు. ఈ చీరలకు ముడిసరకును ధర్మవరం, చీరాల, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కొంటారు. పట్టుమగ్గాలపై నూలుతో తయారు చేసే పట్టుచీరల ఉత్పత్తి ఇక్కడే కనిపిస్తుంది. కాటన్ గద్వాల పట్టు ఎమ్మిగనూరులో మాత్రమే నేస్తారు. వీటి ధర 3 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల వరకు పలుకుతుంది.
మండుటెండల్లో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా పొందూరు నేత చీర - చేపముల్లే ప్రత్యేకం - Ponduru Khadi Sarees
కొన్ని దశాబ్దాల పాటు పట్టుచీరల వ్యాపారులంటే 50 ఏళ్లకు పైబడిన వారు ఉండేవారు. ఆ వ్యాపారుల పిల్లలు డిప్లొమా, మెకానికల్ రంగం, బీఎస్సీ తదితర కోర్సులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించారు. కానీ వాటిని వద్దనుకుని స్వయంగా ఎదిగేందుకు ముందుకు వస్తున్నారు. చదువుకున్న యువత రాకతో సరికొత్త మార్కెటింగ్ ఏర్పడింది. కొత్త డిజైన్లు వేయించడం, సాంకేతికతను ఉపయోగించి కొత్త చీరలను నేయించడం వంటివి చేస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని ఇతర ప్రాంతాల్లో సుమారు 11,000 మంది పట్టు మగ్గాలు ఉన్నాయి. వాటిపై దాదాపు 3 వేల మందికి పైగానే యువత ఆధారపడి జీవిస్తున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల్లో మాస్టర్ వీవర్స్ కింద సుమారు 1,500 మంది యువత ఉన్నారు. వీరిలో 700 మందికి పైగా ఆధునిక సాంకేతికతో వ్యాపారం చేస్తున్నారు.
కొత్త డిజైన్లతో పెరిగిన మగ్గాలు : గతంలో ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లో దాదాపు 17 వేల మగ్గాలు మాత్రమే ఉండేవి. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఇప్పుడు పట్టు మగ్గాలకు అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎమ్మిగనూరులో పట్టు మగ్గాలు దాదాపు 5 వేలు, కోడుమూరులో 4 వేలు, ఆదోనిలో 2 వేలకు పైగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పట్టు చీరలను ఎక్కువగా ఉత్పిత్తిని చేస్తున్నారు. ఈ చీరలతో పాటు సికో పట్టుచీరలు, నేసిన చీరలకు కోల్‌కతా నుంచి వచ్చిన కార్మికులతో సరికొత్త డిజైన్లను వేయిస్తున్నారు.
ఎమ్మిగనూరు పట్టణంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కోల్‌కతా ప్రాంతాలకు చెందిన వారు సుమారు 500 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మగ్గాలపై ఆధారపడి, టోపు అతకడం, రాట్నం, కండీలు చుట్టడం ఇతర పనులపై 3 వేల మందికి పైగానే నేత కార్మికులు ఆధారపడ్డారు. ప్రస్తుతం చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మగ్గం నేసే కార్మికులకు పట్టుచీరలు ఉత్పత్తి చేస్తే రూ.2000 నుంచి రూ. 8000 వరకు కూలీ ఇస్తున్నారు. కూలీ మగ్గాలపై ఆధారపడ్డ కార్మికులు 7000 మందికి పైగా ఉన్నారు.
విశాఖ బీచ్‌లో 'శారీ వాక్'- ర్యాంప్‌పై సందడి చేసిన వనితలు - saree walk in visakha