Different Types of Frauds in AP : మనిషి అత్యాశ, అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయగాళ్లు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. మాటలే వారికి పెట్టుబడి అత్యాశే రాబడి. మన మధ్య తిరుగుతూ కొందరు మోసపుచ్చుతున్నారు. ఒకచోట తక్కువ ధరకు వస్తువులు ఇప్పిస్తామని మరోచోట ఆరోగ్య పరీక్షలు చేస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తెలియని వ్యక్తుల్ని నమ్మవద్దని, ఏదైనా ఒకటికి పదిసార్లు పరిశీలన చేసుకుని డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా పల్నాడు జిల్లాలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే లీటర్ రూ.97గా ఉన్న డీజిల్ రూ.70కే ఇస్తామని ఓ వ్యక్తి చెబితే ముందు వెనుకా ఆలోచించకుండా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బోర్‌వెల్స్ వ్యాపారులు నమ్మి మోసపోయారు. 1000 లీటర్ల డీజిల్ రూ.70 చొప్పున ఇస్తానని మోసగాడు చెప్పడంతో పోటీపడి నష్టపోయారు. అవసరమే ఆసరాగా నమ్మించి మోసగించేవారు మన మధ్యనే ఉన్నారని ఈ విషయంతో వెల్లడైంది.
Rising Fraud Cases in Palnadu District : బీపీ, షుగర్, జీర్ణకోశ సంబంధ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వారివద్దకు నలుగురైదుగురు యంత్రాలతో వచ్చి రక్త పరీక్షలు చేసి మీ ఆరోగ్య సమస్యలేమిటో చెబుతామంటే నమ్మేస్తున్నారు. రూ.4,000ల నుంచి రూ.5,000లు అయ్యే వైద్య పరీక్షలు రూ.500కే చేస్తామని రక్తం తీసి, డబ్బు వసూలు చేసి పరారవుతున్నారు. సత్తెనపల్లి మండలం పెదమక్కెన వాసుల్ని ఇలాగే వైద్య పరీక్షల పేరుతో కొందరు మోసగించారు. పల్నాడు జిల్లాలోనూ ఈ తరహా మోసాలు జరిగాయి. ప్రజలు అప్రమత్తమై ఏ రూపంలో మోసపోతున్నామో తెలుసుకొనేలోపే మోసగాళ్లు నిలువునా దోచేస్తున్నారు.
వ్యాపార లావాదేవీలు విస్త్రృతంగా పెరిగాయి. దీన్ని అవకాశంగా తీసుకొని మాయగాళ్లు మన జేబును గుల్లజేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన ఓ మోసగాడు స్ఫూప్ యాప్ నిక్షిప్తం చేసుకుని మోసపూరిత నగదు చెల్లింపులు చేశాడు. ఒకటికి పదిసార్లు చెల్లింపులు చేసినా వ్యాపారులు తెలుసుకోలేకపోయారు. నగదు చెల్లించినట్లు ఆ యాప్‌లో టిక్ చూపిస్తుందే తప్పించి వారి బ్యాంకు ఖాతాకు నగదు జమ కాదు. సత్తెనపల్లిలో వ్యాపారులు అప్రమత్తమై మోసగాడిని పట్టించారు.
ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా తమ వస్తువుల్ని ప్రచారం చేస్తే నెలకు రూ.వేలు ఇస్తామంటూ కొందరు ఏజెంట్లను పెట్టుకుని మరి మోసం చేస్తున్నారు. గృహిణులను లక్ష్యంగా చేసుకుని డబ్బు వసూలు చేస్తున్నారు. రూ.300 నగదు చెల్లించి తాము పంపించిన ప్రచార పత్రాన్ని వాట్సప్ స్టేటస్‌గా 30 రోజులు పెడితే రూ.10,000ల నుంచి రూ.12,000లు నేరుగా మీ బ్యాంకు ఖాతాకే జమ చేస్తామంటూ వేలాదిమంది మహిళల్ని మోసం చేశారు. సత్తెనపల్లికి చెందిన ముగ్గురు మహిళలు 30 రోజులు స్టేటస్‌లు పెట్టినా పైసా వారికి రాలేదు. ఇలాంటి యాప్‌ల ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మోసగించడమే పనిగా : అన్నదాతలకు తక్కువ ధరకు ప్రముఖ కంపెనీల పురుగు మందులు, విత్తనాలు ఇప్పిస్తానని తెలంగాణతోపాటు జిల్లాకు చెందిన రైతులను ఓ వ్యాపారి మోసం చేశాడు. సత్తెనపల్లి అచ్చంపేట రోడ్డులోని రైల్వేగేటు వద్ద ఓ కార్యాలయం తెరిచి ఒక్కో రైతు నుంచి రూ.2,000ల చొప్పున నగదు వసూలు చేసి రూ.లక్షలతో ఉడాయించాడు. మరోవైపు వ్యాపారాలు చేయాలనుకునే వారిని గుర్తించి మోసపుచ్చేందుకు కొందరు ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. పొట్లం యాప్ పేరుతో పెట్టుబడులు పెట్టించి రూ.50 కోట్ల లాభాలు వస్తాయని రూ.25 లక్షలు నొక్కేసిన వ్యవహారం నరసరావుపేటలో తాజాగా బయటపడింది.
అప్రమత్తతే రక్ష : కొత్త వ్యక్తులను నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు సైబర్‌తోపాటు కొత్త తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మోసాలకు పాల్పడేవారు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు కోరారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే