Foxconn Representatives Meet Minister Nara Lokesh: ఏపీలో భారీ పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
ఫాక్స్‌కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. ఉండవల్లి నివాసానికి వచ్చిన ఫాక్స్‌కాన్ బృందానికి లోకేశ్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామన్నారు.
2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీల గురించి వివరించారు. ఫాక్స్‌కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుంచి 2019 వరకూ వచ్చిన అనేక కంపెనీల్లో ఫాక్స్‌కాన్ కూడా ఒకటని గుర్తుచేశారు. ఫాక్స్ కాన్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోందని, ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని చెప్పారు.
ప్రజా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్య సాధనలో ఫాక్స్‌కాన్ ప్రధాన భూమిక పోషించాలని లోకేశ్ ఆకాంక్షించారు. అనుమతుల నుంచి ఉత్పత్తి వరకూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సహకారం కావాలన్నా తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
I was delighted to meet a senior delegation of @HonHai_Foxconn led by Mr. V Lee at Amaravati today. I was happy to learn about Foxconn's plans in India to develop more manufacturing facilities across EVs, digital health and electronic components.
— Lokesh Nara (@naralokesh) August 19, 2024
I apprised them about our leader… pic.twitter.com/rxi1B4VYke
ఏపీలో గత ఐదేళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఫాక్స్ కాన్ కంపెనీ ఇండియన్ ప్రతినిధి వి.లీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమకు అనేక ప్లాంట్లు ఉన్నాయని, ఇండియాలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించే ఆలోచనలో ఉన్నామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు.