Four Members Arrested in Jammalamadugu : రాష్ట్రంలో పోలింగ్ శాతం ఏ విధంగా పెరిగిందో అంత కన్నా ఎక్కువగా భారీ ఎత్తున హింసాకాండ చెలరేగింది. పోలింగ్ రోజున ప్రారంభమైన దాడులు కూడా తర్వాత కొనసాగాయి. ఈ ఘటనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో రాజకీయ నాయకులను గృహ నిర్బంధం చేయడం, ఊర్లు దాటించడం జరిగింది. రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. అనంతరం రాష్ట్రంలోని హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. ఈ హింసాకాండలపై హైకోర్టు సీఎస్, డీజీపీలకు గొడవలు అరికట్టాలని ఆదేశించింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఆయా ప్రాంతాలలో ఘర్షణలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ సందర్భంగా వైఎస్సార్ జిల్లా పోలీసులు సోషల్ మీడీయాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. డీఏస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మే 13 జరిగిన పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ, కూటమి వర్గీయుల మధ్య ఘర్షణలు జరగడం, రెండు రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గొడవలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మలమడుగులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మలమడుగుకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.
వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, బీజేపీ కార్యాలయాల వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి నివాసాలతో పాటు యర్రగుంట్ల మండలం నిడిజివ్విలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మూడు పార్టీల ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు. జమ్మలమడుగుకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరినైనా కించపరిచేలా పోస్టులు పెట్టినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీనికి గ్రూప్ అడ్మిన్లను బాధ్యుల్ని చేస్తామని స్పష్టం చేశారు.