Former IAS PV Ramesh Kumar : "నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టేస్తాం, జైలులో వేసేస్తాం, భూముల్ని లాక్కుంటాం, గనులు, పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పాలించాలి. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు గుర్తెరగాలి. ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం" అని ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో సోమవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
బందిపోట్ల పాలన అవుతుంది : ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎమ్మెల్యేను కాబట్టి ఇసుక, మంత్రిని కాబట్టి గనుల్ని దోచేస్తాం, తాను పట్టణాభివృద్ధి మంత్రిని కాబట్టి విశాఖ చుట్టూ ఉన్న భూముల్ని ఆక్రమిస్తా, వాటిని బంధువులు, డ్రైవర్లు, అటెండర్ల పేరుతో మార్చుకుంటానంటే అది ప్రజాస్వామ్యం అవ్వదని పీవీ రమేష్ అన్నారు. బందిపోట్ల పాలన అవుతుందని, సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదని, ఒక్కటేనని, రెండూ అవసరమేనని తెలిపారు. డబ్బు పంచడం సులభమే, అందుకు బటన్ నొక్కితే సరిపోతుందని, దానికి ఇంటర్నెట్ ఉంటే చాలని, అదొక్కటే పాలన కాదని అన్నారు. ప్రజలకు అవసరమైన సమగ్ర సేవలు అందించడమే ప్రభుత్వ పాలన అని పేర్కొన్నారు.
ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ముందుకెళ్తున్నట్లు అనిపించడం లేదని, రివర్స్ ఇంజిన్‌తో వేగంగా రాంగ్ రూట్‌లో వెళ్తున్నామేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. దానికి బాధ్యత రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలించేవాళ్లదేనని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులది కూడా అని తెలిపారు. ఎన్నికలు అయిదేళ్లకు ఒకసారి వచ్చే పండగ కాదని, 500 ఏళ్లకు అవసరమైన పునాది ఇప్పుడు పడుతుందని పేర్కొన్నారు. ఇవి చాలా కీలకమైన ఎన్నికలని, త్వరలో నాలుగో పారిశ్రామిక విప్లవం రాబోతోందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్స్‌లతో ప్రపంచమే మారిపోబోతోందని, వాటిని అందిపుచ్చుకోగల నాయకత్వం రాష్ట్రానికి కావాలని తెలిపారు. ఆ నైపుణ్యాలు యువతకు నేర్పించగలగాలని, నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందాలని, బోగస్ హామీల్ని నమ్మకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
పేదలకు డబ్బులు పంచినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదు: పీవీ రమేష్
ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్రంలో నిబంధనల ప్రకారం పని చేయాలని తెలిపారు. తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తన ఆస్తుల మ్యుటేషన్‌కు అక్కడి ఎమ్మార్వో, ఇతర అధికారులు ఇబ్బంది పెడుతున్నారని గుర్తు చేశారు. ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తాను ఇబ్బంది పడుతుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం పని చేయకుండా డబ్బు కోసమో, రాజకీయ నాయకులు చెప్పినట్లో చేస్తే సమాజం కూలిపోతుందని వెల్లడించారు.
అధికారులు తమ పరిధి మేరకే వ్యవహరించాలి:విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్