Food Adulteration has Increased in Hyderabad : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీ తీవ్రమైంది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ బృందం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ కేంద్రాలపై వరుసగా దాడులు చేస్తున్నప్పటికీ కొందరు యజమానులు తమ వైఖరి మాత్రం మార్చుకోవట్లేదు. కుళ్లిన మాంసం, కూరగాయలను వంటలకు ఉపయోగిస్తున్నారు. వంట గదులను మరుగుదొడ్డిలా నిర్వహిస్తున్నారు. తుప్పు పట్టిన పాత్రల్లో ఆహారం తయారు చేసి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC) ఆరోగ్య విభాగంలోని కొందరు అధికారుల తీరు అందుకు ప్రధాన కారణం. అధికారులు యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రయోగశాల నివేదికలను తొక్కిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి.
కందిపప్పులో బొద్దింకలు : నగరంలోని కొండాపూర్ శరత్ సిటీ మాల్‌లో ఉన్న చెట్నీస్ హోటల్‌లో శుక్రవారం ఆ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. ‘‘కంది పప్పు డ్రమ్ములో బొద్దింకలున్నాయి. గోధుమపిండి, రవ్వకు పురుగులు పట్టి నల్లగా మారాయి. ఫినాయిల్ డబ్బాలను కిరాణ సరకులను ఒకే చోట నిల్వ చేశారు. ఉల్లిపాయలు, క్యాబేజీ గడ్డలు పూర్తిగా కుళ్లాయి’’అని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. అదే మాల్‌లోని అల్పాహార్ టిఫిన్స్ కేంద్రంలో మూతల్లేని చెత్త డబ్బాలు, ఇతర లోపాలు ఉన్నట్టు గుర్తించారు.
బయట తినాలంటేనే : తీరిక లేని నగర జీవనంలో చాలా మంది నగరవాసులు సమయానికి ఇంట్లో తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దగ్గర్లో ఉన్న హోటల్‌లో లేదా రెస్టారెంట్లలో తిని రోజు గడుపుతుంటారు. వాళ్ల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న యాజమాన్యాలు నాసిరకం సరకులతో, అపరిశుభ్రత, అనారోగ్యకర వాతావరణంలో వంటలను తయారు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇటీవల దాదాపు 500ల చోట్ల తనిఖీలు చేయగా, 90శాతం కేంద్రాల్లో లోపాలు బయటపడటమే అందుకు నిదర్శనం. దాంతో భగ్యనగరం నగరవాసులు బయట తినాలంటే వణికిపోతున్నారు.
జీహెచ్‌ఎంసీ చేతివాటం : తెలంగాణ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం రోజూ హోటళ్లలో తనిఖీ చేస్తోంది. వాటిని ఓ రోజు తర్వాత లోపాలను ‘ఎక్స్’ వేదికగా వెల్లడిస్తోంది. 20 మంది ఆహార భద్రతాధికారులు ఉన్న జీహెచ్‌ఎంసీ మాత్రం ఏడాదికో, ఆర్నెల్లకో తనిఖీ నివేదికలను ప్రకటిస్తోంది. ఏ రోజు ఏ హోటల్‌ను తనిఖీ చేశారనే విషయాన్ని కనీసం నెలకోసారి కూడా చెప్పట్లేదు. పైగా రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ చేసిన హోటళ్ల యజమానులతో కొందరు బల్దియా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు చేతులు కలుపుతున్నారని, అందుకే ల్యాబ్ పరీక్షల నివేదికలను బయటపెట్టడం లేదని వాపోతున్నారు.
ఏంతింటున్నామో తెలుసా? - వాస్తవాలు తెలిస్తే వాంతులే! - hotel food