Flood Effect in Andhra Pradesh : రాష్ట్రంలో గడచిన మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ రహదారులన్నీ జలమయమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్ర కాలువ ఉగ్రరూపం దాల్చడంతో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నాట్లు వేసిన నెల రోజుల్లోపే పంట మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 15,000ల వరకు పెట్టుబడి పెట్టామని అన్నదాతలు వాపోయారు.
AP Weather Updates 2024 : నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నరసాపురం స్నానాల రేవుల్లో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు, పంటుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్లూయిస్ తలుపులు మూసివేసి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించాలని చెప్పారు.
పొలాల్లోకి చేరిన వరద నీరు : అయినవిల్లి లంక వద్ద ఎదురుబిడియం కాజ్వే చుట్టూ పొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో లంక గ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. బూరుగులంక రేవులో పరిస్థితులను కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ పరిశీలించారు. మర పడవల్లో ప్రయాణించే ప్రజలు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. మోకాలి లోతులో నీరు నిలిచిన పంట చేలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలతో మాట్లాడి వారి బాధలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు : కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోవరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హామీ ఇచ్చారు. ముమ్మిడివరం మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరిచేలను వ్యవసాయ శాఖ అధికారులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తాత్కాలిక రహదారులు, కాజ్‌వేలు నీటమునిగాయి.
అల్లూరి జిల్లాలో ముంపు మండలాలైన చింతూరు డివిజన్‌లో కలెక్టర్ దినేశ్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి సొంత ఖర్చులతో శబరి కొత్తగూడెం, కూనవరం ప్రాంతాల్లో నాలుగు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. వీఆర్‌పురంలో బాధితులకు నిత్యావసర సరుకులు అందించారు.
పొంగి ప్రవహిస్తున్న కొండవాగులు : చింతూరు, చట్టి ప్రాంతంలో ప్రజలు పునరావాస ప్రాంతాలకు వెళ్లాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. ముంపు మండలాలైన కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షాలకు రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సీతపల్లి, జడ్డంగి, పాములేరు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిలిచిపోయిన రాకపోకలు : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప వంతెన వద్ద కట్టలేరు వరద ఉధృతి కారణంగా నాలుగురోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా బేసిన్‌లో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో భారీగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడు - బొబ్బిల్లంక వద్ద కొట్టుకుపోయిన వంతెన వద్ద 15 సంవత్సరాల బాలుడు అదృశ్యమయ్యాడు. వంతెనపై బాలుడి సైకిల్ ఉండడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాబు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.