Vijayawada Recovering to Floods : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరదానంతర చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగుకాలువల్లో పెద్ద ఎత్తున చేరిన పూడికను యుద్ధ ప్రాతిపదికన జేసీబీల సాయంతో తొలగిస్తోంది. నగరపాలక సంస్థ విడుదల చేస్తున్న నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని చెత్త, మురుగుని శుభ్రం చేసి పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్ చల్లుతున్నారు. సింగ్‌నగర్‌లో ఇప్పటికే పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాయకాపురంలోనూ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అంబాపురంలోనూ వరద తగ్గింది. ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో వరద ప్రభావం నుంచి నగరం వేగంగా సాధారణ పరిస్థితికి చేరుకుంటోంది.
కీలకపాత్ర పోషించిన అగ్నిమాపక శాఖ : వరద తెచ్చిన బురద నుంచి బెజవాడ వాసులకు ఉమశమనం కల్పించడంలో కీలకపాత్ర పోషించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారుల్ని ఆ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రజల మధ్యనే భుజం తట్టి అభినందించారు. స్వయంగా సంతకాలు చేసిన ప్రశంసాపత్రాలతోపాటు రికార్డు అందించి ప్రోత్సహించారు. మేమున్నామంటూ భరోసా కల్పించిన అగ్నిమాపక సిబ్బందిని ప్రజలు బహిరంగంగా అభినందించడం తమకు లభించిన గొప్ప అవార్డుగా అభివర్ణించారు.
"వరదలతో అతలాకుతమైన విజయవాడని సాధారణ స్థితికి తీసుకురావడంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది కీలకపాత్ర పోషించారు. ఇది ఈ శాఖ పరిధిలోకి రానప్పటికి ప్రజల కష్టాలకు చలించి ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ముందుకు వచ్చాం. బాధితులు కృతజ్ఞతలు తెలుపుతుంటే ఎంతో సంతోషంగా ఉంది." - మాదిరెడ్డి ప్రతాప్, అగ్నిమాపకశాఖ డీజీ
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు మంత్రి నారాయణ, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కండ్రిక, ఉడా కాలనీ, జర్నలిస్టు కాలనీల్లో ఇళ్లను ఇప్పటికీ వరద వీడలేదు. ఒకవైపు మోటార్లతో పంపింగ్ చేస్తూ మరోవైపు రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి పంపేలా ఏర్పాట్లు చేశారు. వరద నీటి పంపింగ్ పనులను మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లి పరిస్థితి సమీక్షించారు. బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ప్రొక్లెయిన్‌లతో పూడిక తొలగిస్తున్నారు. ఉడా కాలనీ వెనుక కట్టకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచించారు. వరద ప్రాంతాల్లో నష్టం వివరాల అంచనా ప్రక్రియ వేగంగా జరుగుతోందని వెల్లడించారు. ఎన్యుమరేషన్ జరగని ప్రాంతాల్లో మరోసారి వెళ్లి చేసేలా సిబ్బందికి అదేశాలిస్తామన్నారు.
"ప్రస్తుతం 63,64 డివిజన్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో కొంతవరకు వరద ఉంది. సుందరనగర్ దగ్గర ఒక కట్ట వేస్తే ఆ నీళ్లు ఆగిపోతాయి. అధికారులను ఇప్పటికే ఆదేశించాం. ముఖ్యమంత్రి అన్నింటిని సమీక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. ఎన్యుమరేషన్ కాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నష్టం వివరాలను నమోదు చేసుకొని వారి వద్దకు మరోసారి వెళ్లి ప్రక్రియ పూర్తి చేస్తాం." - పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి