Thotakura Gopichand Space Tour : భారతదేశ తొలి స్పేస్ టూరిస్టుగా రికార్డు సృష్టించిన తోటకూర గోపీచంద్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమాన పైలెట్లలో ఒకరు. మూడు పదుల వయసు కూడా దాటక ముందే భారతీయ, విదేశీ జెట్‌లు, వైద్య విమానాలను వేల గంటల సమయం నడిపిన ఘనతను సాధించిన సుశిక్షితుడైన పైలెట్. కేవలం విమానాలే కాకుండా సీప్లేన్, హాట్‌ఎయిర్ బెలూన్ పైలెట్‌గా, సర్టిఫైడ్ డైవింగ్ శిక్షకుడిగానూ గోపీచంద్‌కు గుర్తింపు ఉంది. పర్వాతారోహకుడిగానూ కిలిమంజారోను అధిరోహించి భారతదేశ పతాకాన్ని శిఖరంపై ఎగరేశాడు.
Thotakura Gopichand Life Story in Telugu : తోటకూర గోపిచంద్ దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు. భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇంతటి కీర్తిని సంపాదించిన గోపీచంద్‌కు విజయవాడతో విడదీయలేని అనుబంధం ఉంది. విజయవాడ శివారుల్లోని పోరంకి వీరి సొంతూరు. పోరంకిలోని వందడుగుల రోడ్డులో ఉన్న తోటకూర భూమయ్య భవనంలో వీరి కుటుంబం నివాసం ఉంటోంది. ప్రస్తుతం అతని తాతయ్య భూమయ్య, నాన్నమ్మ స్వర్ణలత అక్కడే ఉంటున్నారు. అమెరికాలో ఉన్న గోపీచంద్ రెండు నెలల కిందటే నగరానికి వచ్చి వెళ్లారు. ఇతని తండ్రి విజయకుమార్, తల్లి పద్మజ. వీరికి మేఘశ్యామ్, గోపీచంద్ ఇద్దరు అబ్బాయిలు. చిన్నవాడైన గోపీ 1993, మే 14న పుట్టారు.
తోటకూర గోపిచంద్ ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖ, హైదరాబాద్, దిల్లీల్లో సాగింది. విశాఖలోని టింఫనీ, దిల్లీలోని సంస్కృతి, బాలభారతి ఎయిర్‌ఫోర్స్ పాఠశాల, హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతిలో చదువుకున్నాడు. బెంగళూరులోని సరళ బిర్లా కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదివారు. అనంతరం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్ సైన్స్‌లో డిగ్రీ కోర్సు పూర్తి చేశారు. అక్కడే కమర్శియల్ పైలెట్‌గా శిక్షణ తీసుకుని లైసెన్స్ కూడా పొందారు. ఆ తర్వాత యూకెలోని ఎమిరేట్స్, కొవెంట్రీ విశ్వవిద్యాలయంలో ఏవియేషన్‌లో ఎంబీఏ చదివారు. ఆ తర్వాత బిజినెస్ జెట్స్, మెడికల్ ఫ్లైట్స్‌ను దేశవిదేశాల్లో వేల గంటలు విజయవంతంగా నడిపాడు. ప్రస్తుతం అమెరికా కేంద్రంగా ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ పేరుతో పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో కూడిన వెల్‌నెస్ రిసార్ట్‌ను స్థాపించారు. ఈ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా గోపీచంగ్ ప్రస్తుతం సేవలందిస్తున్నారు.
తన మనవడు అంతరిక్షంలోనికి వెళ్లి దిగ్విజయంగా తిరిగి రావడం మాకెంతో గర్వకారణంగా, ఆనందంగా ఉందని తాతయ్య భూమయ్య, నాన్నమ్మ స్వర్ణలతలు తెలిపారు. చిన్నతనం నుంచి ఎంతో చురుకుగా ఉండే గోపీచంద్ అందరికంటే ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నించే వాడన్నారు. గతంలోనూ కిలిమంజారోను అధిరోహించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం వాళ్ల నాన్న విజయకుమార్, తల్లి పద్మజ కూడా అమెరికాలో గోపీచంద్‌తో పాటే ఉన్నారని అన్నారు. త్వరలోనే వాళ్లంతా కలిసి విజయవాడకు వస్తారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.