First Day Nominations in Telangana 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే పలువురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రత్యేక పూజల అనంతరం, భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో కమలం పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
BJP Candidates Nominations in Telangana 2024 : మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి బీజేపీ (BJP on Lok Sabha Polls) అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. శామీర్‌పేట నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు ఈటల కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈటల రాజేందర్, ఆయన సతీమణి 2 సెట్ల నామపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు హరదీప్‌సింగ్ పురీ, కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
నామినేషన్ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు ప్రత్యేక వాతావరణంలో జరుగుతున్నాయని ఈటల రాజేందర్ (Etela Rajender on Lok Sabha Polls) అన్నారు. 50 రోజులుగా ప్రజల అభిప్రాయాలు వింటున్నామని, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. ఎక్కడ చూసినా అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదాలే వినిపిస్తున్నాయని తెలిపారు. మోదీ ఉంటేనే దేశ రూపురేఖలు మారతాయని జనం చెబుతున్నారని ఈటల రాజేందర్ వివరించారు.
Telangana Lok Sabha 2024 Nominations : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి అవకాశాలు పెరిగాయని జనం అంటున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మోదీ పాలన వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం పెరిగిందని చెబుతున్నారని, కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను ప్రధాని కాపాడారని చెప్పారు. తమ జీవితాల్లో మోదీ వెలుగులు నింపారని బడుగు వర్గాలు అంటున్నారని, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. కేసీఆర్,రేవంత్ డబ్బు సంచులతో నాయకుల తలలకు వెల కట్టారని ఆరోపించారు. మినీ ఇండియాగా మల్కాజిగిరికి మారుపేరు ఉందని ఈటల రాజేందర్ వెల్లడించారు.
"మల్కాజిగిరిలో 50 రోజులుగా ప్రజల మధ్య తిరుగుతున్నా. ఈసారి పెద్దసంఖ్యలో ఓట్లు వేసేందుకు జనం ఆసక్తిగా ఉన్నారు. పదేళ్ల మోదీ పాలన చూసి మళ్లీ ఆయనే రావాలని కోరుతున్నారు. ముస్లిం మహిళలు కూడా మోదీకే ఓటు వేస్తామని అంటున్నారు. ఇతర పార్టీలు తమను ఓటుబ్యాంకులా చూశాయని అంటున్నారు. దొంగ సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఓట్లు, సీట్లు కాదు మల్కాజిగిరిని ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తా. మోదీ అండతో మల్కాజిగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తాం." - ఈటల రాజేందర్, మల్కాజిగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి
భారీ మెజార్టీతో గెలుస్తా : అంతకుముందు శామీర్‌పేట ఈటల రాజేందర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రులు హరదీప్‌సింగ్ పురీ, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నట్లు వారు తెలిపారు. మల్కాజిగిరిలో కురుక్షేత్రంలా ధర్మానికి, ఆ ధర్మానికి మధ్య యుద్ధం జరగనుందని ఈటల రాజేందర్ అన్నారు. సర్వే సంస్థల అంచనాలకు అందకుండా భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024 : మహబూబ్‌నగర్ అభ్యర్థిగా డీకే అరుణ (DK Aruna on Lok Sabha Elections 2024 )నామినేషన్ వేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో కలిసి మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు వెళ్లిన ఆమె రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవికి నామపత్రాలు అందజేశారు. అంతకు ముందు పట్టణంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నామినేషన్ పత్రాలకు డీకే అరుణ పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం, నామపత్రాలు దాఖలు చేశారు.
నామినేషన్ అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి అనేక సేవలు చేశానని డీకే అరుణ చెప్పారు. జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు వచ్చేందుకు కృషి చేశానని అన్నారు. ప్రజల కోసం పనిచేసే తనను ఓడించాలని ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కోసం పనిచేసిన వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మహిళ అనే మర్యాద కూడా లేకుండా తనను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే తనను ప్రజలంతా ఆశీర్వదించి గెలిపిస్తే మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని డీకే అరుణ హామీ ఇచ్చారు. మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మెదక్ కలెక్టరేట్ వద్దకు ఆయన భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు.
మోదీ గ్యారంటీలే అస్త్రం - లోక్‌సభ పోరులో జోరుగా బీజేపీ ప్రచారం - LOK SABHA ELECTION 2024