Two Elephants Halchal in Chittoor District: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు స్వైర విహారం చేశాయి. గజరాజుల స్వైర విహారంతో రైతులు హడలి పోతున్నారు. మండలంలోని గ్రామాల్లో రెండు ఏనుగులు సంచరించాయి. రామకుప్పం అటవీ ప్రాంతం మకాం వేసిన రెండు ఏనుగులు శుక్రవారం తెల్లవారుజామున కుప్పం మండలం పెద్దగోపన్నపల్లి గ్రామంలో జనవాసాల్లోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి నడుమూరు, గోనుగూరు, వెండుగాంపల్లి, ఉర్ల, ఓబన్నపల్లి పరిసరాల్లో ఏనుగులు సంచరించాయి. పొలాల్లో ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా తిష్ట వేసిన ఏనుగులు పంటలను తొక్కి నాశనం చేస్తుండటంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. బాణసంచా కాల్చి గజరాజులను అడవిలోకి మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్! - Mother Elephant Tearful Moment
ఇదే విధంగా గత నెలలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలమనేరు మండలం ముసలిమడుగు సమీప ప్రాంతాల్లో ఓ ఒంటరి ఏనుగు సంచరించింది. రామచంద్ర నాయుడు అనే రైతు పొలంలోకి ఏనుగు చొరబడి అక్కడి రేకుల షెడ్డును ధ్వంసం చేసింది. అంతేగాక అందులో ఉన్న ఐదు మూటల పశువుల దానాను నాశనం చేసింది. పక్కనే ఉన్న వరి పంట, అలాగే అర ఎకరంలో వేసిన అరటి తోటలను సైతం గజరాజు నాశనం చేసింది.
పూతలపట్టు నియోజకవర్గంలో కూడా ఏనుగులు హడలెత్తించాయి. ఐరాల మండలం చుక్కవారిపల్లి గ్రామంలోని పంట పొలాల్లో 19 ఏనుగులు తిష్ట వేశాయి. గ్రామంలోని అరటి, మామిడి, చెరకు పంటలను ధ్వంసం చేశాయి. పంటల రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన కంచెను సైతం నేలమట్టం చేశాయి. అనంతరం వ్యవసాయ పొలాల నుంచి గ్రామాల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు సమీప ప్రాంతంలోని పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితం అవుతున్నామని, ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఏనుగుల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఏనుగు దాడిలో రైతుకు గాయాలు, కారు ధ్వంసం - అక్కడే తిష్ట వేసిన గజరాజు