Fake Pass Books Scam in Telangana : ఇది మీకు తెలుసా రూ.10 వేలు ముట్టజెప్పితే ఎకరం భూమి హక్కు పత్రం (పట్టా పుస్తకం) ఇస్తారు. మరో రూ.10 వేలు ఇస్తే బ్యాంకులో పంట రుణం ఇప్పిస్తారు. చదవడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. మరి ఈ విషయం ఎక్కడే తెలుసుకుందామా?
ఎక్కడ అంటారా : తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో దళారులు అటవీ భూములకు అటవీ హక్కు పత్రాల (పట్టా పుస్తకాల) పేరుతో నడిపిస్తున్న నయా దందా ఇది. అటవీ, మారుమూల గ్రామాల రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ పోడు పట్టాదారు పుస్తకాలను అంటగట్టి రెండు చేతులా దండుకుంటున్నారు. ఈ నకిలీ పుస్తకాలు చలామణి బహిరంగంగానే సాగుతున్నా సంబంధిత ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలా జరిగిందంటే : గత సంవత్సరం పోడు భూములు సాగు చేసిన గిరిజన తెగకు చెందిన నాయకపోడు, కోయ, లంబాడ, ఎరుకల సామాజిక వర్గాల వారికి సర్కార్ సర్వే చేసి అటవీ హక్కు పత్రాలు(పట్టాదారు పుస్తకం) జారీ చేసింది. దీనిని అవకాశంగా తీసుకుని సులువుగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ అటవీ హక్కు పత్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. సదరు దళారీ గ్రామాల్లోకి వెళ్లి తనకు రూ.10 వేలు ఇస్తే ఎకరం భూమి పోడు పట్టా పుస్తకం ఇస్తానని నమ్మబలికాడు.
ముందుగా ఒకరిద్దరికి పట్టా పుస్తకాలు ఇచ్చాడు. దీంతో అది నమ్మి వివిధ గ్రామాలకు చెందినవారు మూడు, నాలుగు ఎకరాలకు నగదు ముట్టజెప్పి పుస్తకాలు పొందారు. ఓ అటవీ గ్రామంలో గిరిజనేతరులైన అన్నదాతలకు నకిలీ పోడు పట్టాలు ఇవ్వడం కొసమెరుపు. నల్లబెల్లి మండలంలో ఐదు గ్రామాలు, నర్సంపేట మండలంలో మూడు గ్రామాల్లో ఈ నకిలీ పోడు పట్టా పుస్తకాలు జోరుగా చెలామణి అయ్యాయి. మరోవైపు గత యాసంగి సీజన్‌లో నర్సంపేటలోని ఓ బ్యాంకు నుంచి వారు పంట రుణాలు పొందడం విశేషం.
బ్యాంకర్ల తీరుపైనా అనుమానాలు : సాధారణంగా అన్నదాతలు పంట రుణం కోసం బ్యాంకుకు వస్తే పట్టాదారు పాసు పుస్తకం, 1బీ పత్రం, ఏ బ్యాంకులో రుణం లేనట్టు (నో డ్యూ) ధ్రువపత్రం తెప్పించుకుంటారు. సదరు రైతు సమర్పించిన పత్రాలు వాస్తవమా కాదా అని ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డులో నిర్ధారణ చేసుకుంటారు. ఆ తర్వాత నానా కొర్రీలు పెట్టి అరకొరగా రుణం ఇస్తారు.
ఈ నకిలీ పోడు పట్టా పుస్తకాలకు అటవీ అధికారుల రికార్డులు పరిశీలించకుండా, నో డ్యూ ధ్రువపత్రం లేకుండానే బ్యాంకు అధికారులు రుణం ఇవ్వడం కొసమెరుపు. దీంతో బ్యాంకర్ల తీరుపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పోడు పట్టా పుస్తకాల గుట్టు రట్టు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ విషయమై నర్సంపేట అటవీక్షేత్ర అధికారి రవికుమార్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
నకిలీ భూ పట్టా సృష్టించిన వ్యక్తిపై కేసు
Amaravathi R5 Zone: అమరావతి సెంటు భూమి పట్టా.. అనర్హుల చిట్టా