Eye Donation Awareness Program at LV Prasad Institute: మరణాంతరం జ్ఞాపకాలు భూమ్మీద సజీవంగా ఉండాలంటే అవయవదానంతోనే సాధ్యం. అయితే, అవయదానాల్లో నేత్రదానం అతి ముఖ్యమైనది. మనం చనిపోయిన తరువాత కూడా ఈ సృష్టిని చూసేందుకు చక్కటి అవకాశం. అయితే దీనిపై చాలా మందిలో సరైన అవగాహన లేదు. అలాంటి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడ సమీపంలోని తాడిగడప ఎల్.వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ క్యాంపస్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వారికి నేత్రదానం విశిష్టతను ఇక్కడి నేత్ర వైద్యులు వివరించారు.
ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నేత్రదానం చేస్తే కళ్లులేని వారికి చూపునిచ్చే వారవుతారు. మరణానంతరం ఈ సృష్టిని చూసే అవకాశం ఉండాలంటే నేత్రదానమే ఏకైక మార్గం. అయితే నేత్ర దానం చేసే వారికి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు ఉండకూడదు. అలాంటి వారి నేత్రాలు ఇతరులకు ఉపయోగపడవు. అయితే ఓ వ్యక్తి నుంచి సేకరించే నేత్రాలతో ఇద్దరు, ముగ్గురికి చూపునిచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అయితే, సేకరించిన కార్నియాను సరైన పద్దతిలో 14 రోజులు మాత్రమే భద్రపరచగలరు. ఆ తరువాత ఆ కార్నియా ఇతరులకు అమర్చడానికి ఉపయోగపడదు. అలాంటి కార్నియాలను నేత్ర విభాగంలో చదువుతున్న వైద్య విద్యార్థుల కోసం వినియోగిస్తారు.
అమెరికాలో కారు షెడ్లో పేలిన తుపాకీ- తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి - DOCTOR SUSPICIOUS DEATH
నేత్రదానం విశిష్టతపై చిత్రాలు: నేత్రదానం ప్రాధాన్యం, విశిష్టతను వివరిస్తూ విద్యార్థులకు ఎల్.వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలకు చెందిన సుమారు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. నేత్రదానం విశిష్టతను వివరిస్తూ రకరకాల చిత్రాలను గీశారు. అందమైన ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాలంటే నేత్రాలు సరిగ్గా కనిపించాలన్న సందేశంతో విద్యార్థులు చిత్రాలను తీర్చిదిద్దారు.
ప్రతీ ఏడాది వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు నేత్రదానం ప్రాధాన్యతను వివరిస్తూ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. అలానే ఈ ఏడాది నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో అవయవదానం, నేత్రదానంపై ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కలిసి అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అప్పుడే మరింత మంది ముందుకు వచ్చేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఏపీలో నగర వనాల అభివృద్ధికి నిధులు - తొలి విడతగా రూ.15.4 కోట్లు - Urban Forests in AP