Extra General Coaches in Express Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు చొప్పున అదనపు జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ - గూడూరు రైలు సింహపూరి (12709/12710 ), సికింద్రాబాద్ - హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703/12704 ), హైదరాబాద్ - విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), కాకినాడ పోర్ట్ - లింగంపల్లి గౌతమి ఎక్స్‌ప్రెస్ (12737/12738 ), కాకినాడ పోర్టు - భావనగర్ (12755/12756 ), కాకినాడ పోర్టు - సాయినగర్ శిర్డీ (17205/17206) ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు.
అదే విధంగా హైదరాబాద్ - తాంబరం చార్మినార్ (12759/12760), కాకినాడ పోర్టు - లింగంపల్లి కోకనాడ ఎక్స్‌ప్రెస్ (12775/12776 ), సికింద్రాబాద్ - భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015/17016), మచిలీపట్నం - యశ్వంత్‌పూర్ కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17211/17212 ), మచిలీపట్నం - ధర్మవరం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17215/17216), కాకినాడ పోర్టు - లోకమాన్య తిలక్ (17221/17222 ) రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
మొత్తంగా దేశవ్యాప్తంగా 46 రైళ్లలో అదనంగా 92 సాధారణ బోగీలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 46 రైళ్లలో 92 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేశామని, మరో 22 రైళ్లలోనూ ఈ తరహా కోచ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా ఇటీవల రద్దు చేసిన విజయవాడ- భద్రాచలం రోడ్ మధ్య నడిచే 07278/07279 నంబరు రైలును నేటి నుంచి పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Trains Timings Changed: వీటితోపాటు ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే పలు రైళ్ల టైమింగ్స్‌ని మార్పులు చేశారు. సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకల వేళల్లో త్వరలో మార్పులు జరగనున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్పులు అక్టోబరు 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్(12710) ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో రాత్రి 11.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు చేరుకుంటుంది. కొత్త మార్పుల ప్రకారం ప్రకారం రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12764) గూడూరుకు తెల్లవారుజామున 4.43కి బదులుగా 4.19కి చేరుకుంటుంది. తిరుపతి స్టేషన్‌కు ఉదయం 7.15 గంటలకు బదులు 6.55కి చేరుకుంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(12734) వేళల్లోనూ మార్పులు చేశారు. సాయంత్రం 6.25 గంటలకు బదులుగా 5.30కి బయల్దేరనుంది. తిరుపతికి ఉదయం 7 గంటలకు బదులుగా 5.55 గంటలకు చేరుకుంటుంది. ఏపీలోని నర్సాపూర్ నుంచి మహారాష్ట్ర వెళ్లే నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (17231) ప్రస్తుతం ఉదయం 11.15కి బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.45కి చేరుకుంటుండగా మారిన వేళల ప్రకారం రాత్రి 9.50కి బయల్దేరి ఉదయం 7.30కి చేరుకోనుంది.