YSRCP Negligence on Polavaram Left Canal Construction : రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓ విషాదగాథలా మార్చింది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తాగు, సాగునీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించే పోలవరం ఎడమ కాలువను ఆ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పట్లోనే గుత్తేదారులను మార్చి వేరేవారికి పనులు అప్పగించాల్సి ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. దీంతో ఎడమ కాలువ పనులు స్తంభించిపోయాయి. అప్పట్లో రూ.657 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పనులకు ఇప్పుడు రూ.2049 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది.
Polavaram project Updates : 2016లో సవరించిన అంచనాల ఆధారంగా ఎడమ కాలువకు రూ.3,645.15 కోట్లు ఖర్చవుతుందని జలవనరులశాఖ అధికారులు తేల్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికే దాదాపు రూ.2987 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ కాలువ పూర్తి చేయాలంటే మరో రూ.2049 కోట్లు అవసరమని లెక్కకట్టారు. ప్రాజెక్టులో అనేక ప్యాకేజీల్లో ఇప్పటికే ఒప్పందాలు రద్దవగా, మిగతా ప్యాకేజీల్లో పనులు నిలిచిపోయాయి.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల క్రితం పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. పనులను పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే పోలవరం ఎడమ కాలువ పనులను ఎలా పట్టాలెక్కించాలనే విషయంపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తైతే ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. మొత్తం 214 కిలోమీటర్ల మేర కోనసీమ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల మీదుగా ఈ కాలువ ప్రవహిస్తుంది. కాలువ మార్గంలో 560 గ్రామాలకు మంచినీటి వసతి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి సాగుకు 84.808 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు అందించేలా ఈ కాలువ తవ్వకాలు చేపట్టారు. మొత్తం 8 ప్యాకేజీలుగా పనులు విడగొట్టారు.
- మొదటి రెండు ప్యాకేజీల్లో కొంత పని మినహా దాదాపు పూర్తయింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా నీళ్లు అందించే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తొలి రెండు ప్యాకేజీల్లో సింహభాగం పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి. ఎడమ కాలువ ద్వారా ఏలేరు జలాశయానికి గోదావరి జలాలను మళ్లించారు. మొదటి ప్యాకేజీలో గుత్తేదారుతో ఒప్పందాన్ని ముందే ముగించారు. ఇంకా 15 కట్టడాలు పూర్తికావాలి. నాలుగున్నర కిలోమీటర్ల మేర మట్టి తవ్వకం, దాదాపు 10 కిలోమీటర్ల మేర కాంక్రీటు లైనింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో ప్యాకేజీలో ఒక నిర్మాణమే పూర్తికావాలి.
- మూడో ప్యాకేజీ మినహాయిస్తే మిగిలిన ఐదు ప్యాకేజీల్లోనూ పనులను విస్తృతంగా చేయాలి. కొన్నిచోట్ల అక్విడెక్టులు, జాతీయ రహదారులను దాటేచోట వంతెనలు నిర్మించాలి. దాదాపు 213 కట్టడాలు ఈ కాలువపై నిర్మించాలి. ఎనిమిదో ప్యాకేజీలో సైఫన్ నిర్మించాలి. ఇంకా 30 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలి.