Minister Anam Ramanarayana Review on Temples: రాష్ట్రంలో ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష సమావేశాలు జరుపుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న పనుల గురించి ప్రాథమికంగా కొంత సమాచారాన్ని అధికారులు, ఇంజినీర్లు, పండితులు వివరించారని పూర్తిస్థాయిలో ఆలయ ప్రాంగణంలోనే త్వరలో కూలంకషంగా సమీక్ష నిర్వహిస్తామని అన్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత అంతవరకు కొనసాగిన పాలకమండళ్లు తమ పదవీ కాలంతో సంబంధం లేకుండా రాజీనామాలు చేయడం నైతిక విలువను పాటించడం అవుతుందని అలా కాకపోతే ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరిని గౌరవించడం మన సంప్రదాయమని ఆనం తెలిపారు. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆలయాల పరిధిలో చేపడుతున్న నిర్మాణాల్లో ఏ మాత్రం నాణ్యత దెబ్బతినకుండా పదే పదే కూల్చివేతలకు తావివ్వకుండా చూస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అతి త్వరలో దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారని, ఆ సమావేశంలో చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందడుగు వేస్తామన్నారు. త్వరలో అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్ల నియామకం జరుగుతుందని మంత్రి ఆనం చెప్పారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చిన మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని ఘనంగా స్వాగతించిన ఆలయ అధికారులు, పండితులు అమ్మవారి ఆలయం, శివాలయంతో పాటు అన్ని ఉపాలయాలను చూపించి పూజలు జరిపించారు. అమ్మవారి సన్నిధిలో ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరుతెన్నుల గురించి ఈవో రామారావు, ఇంజనీరింగ్ సిబ్బంది మంత్రికి వివరించారు. శివాలయం వద్ద విస్తరణ పనులకున్న ప్రతిపాదనల గురించి కూడా తెలిపారు.
హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరిని గౌరవించడం మన సంప్రదాయం. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకుంటాము. ఆలయాల పరిధిలో చేపడుతున్న నిర్మాణాల్లో ఏ మాత్రం నాణ్యత దెబ్బతినకుండా పదేపదే కూల్చివేతలకు తావివ్వకుండా చూస్తాము. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు - ఆనం రాంనారాయణరెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
విజయవాడలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ - ఒకేసారి 500 మందికి విందు - FLOATING RESTAURANT ON KRISHNA