postal ballot Voting process in AP: పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. విసుగు చెందిన ఓటర్లు, ఓటుహక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. అటు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు మండిపడ్డారు.
గందరగోళానికి గురయ్యారైన ఉద్యోగులు: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్దఎత్తున పోటీపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భారీగా ఓటర్లు తరలివచ్చారు. చాలామందికి ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు నిరాశగా వెనుదిరిగారు. పనిచేసే చోటే పోస్టల్ ఓటు ఉంటుందని కొందరు, నివాసం ఉన్నచోట పోస్టల్ బ్యాలెట్ ఇస్తారని మరికొందరు అధికారులు చెప్పడంతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. చాలాదూరం నుంచి వచ్చిన ఉద్యోగులు ఎండలో తిరిగివెళ్లలేక ఇబ్బందిపడ్డారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమయ్యారు.
బ్యాలెట్ ప్రక్రియలో తీవ్ర జాప్యం: అరాచక పాలన సాగించిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరంలోని మహిళా కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని, అధికారులు ఉద్యోగుల సంఖ్యకు తగ్గిన విధంగా పోలింగ్ ఏర్పాట్లు చేయలేదన్నారు. ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రారంభం- పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు - Home Voting Process
కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదు: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దేనని వర్లరామయ్య స్పష్టంచేశారు.
భద్రతా విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే: ఇక గురువారంతో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. చివరిరోజు కేవలం భద్రతా విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించినట్లు ఏపీ ఎన్నికల అధికారు ముఖేష్ కుమార్ మీనా వెల్లడిచారు.