Election Commission Transfers Anantapur DIG Ammireddy : వైఎస్సార్సీపీ సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో 'ఎస్ బాస్'పై ఎన్నికల సంఘం వేటు వేసింది. అనంతపురం రేంజి డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ప్రతిపక్షాలపై అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల్లో వైసీపీకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిపై విచారించిన ఎన్నికల సంఘం చివరకు ఆయన్ను బదిలీ చేసింది. ఆయన తర్వాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు : అమ్మిరెడ్డి 2023 ఏప్రిల్ 13న అనంతపురం రేంజి డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్సార్సీపీ నేతలు చెప్పారంటే చాలు జీహుజూర్ అంటారన్న విమర్శలున్నాయి. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగులిచ్చి పరోక్షంగా సహకరించారు. అనంతపురం సబ్‌డివిజన్ పరిధిలో సొంత సామాజికవర్గానికి చెందిన సీఐలను నియమించి వైసీపీ నాయకులకు అండదండలు అందించారు. డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో వైసీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోలేదు. పైగా మరింత ప్రోత్సహించారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా - బాధ్యతలు స్వీకరణ - Andhra Pradesh New DGP
వైసీపీ విధేయుడిగా పేరున్న వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా తీసుకురావడంలో అమ్మిరెడ్డిదే కీలకపాత్రనే విమర్శలున్నాయి. వీరరాఘవరెడ్డి ఏకపక్ష ధోరణిపై టీడీపీ పలుమార్లు ఫిర్యాదులు చేసినా అమ్మిరెడ్డి స్పందించలేదు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం గ్రామీణ సర్కిల్, ఇటుకలపల్లి సర్కిల్ పోలీసులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్‌కు ముందే అనంతపురం గ్రామీణం, ఇటుకలపల్లి సీఐలను బదిలీ చేయాలని ఫిర్యాదులొచ్చినా వారిని ఆ స్థానాల్లోనే కొనసాగించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడం, రౌడీషీట్లు తెరవడం వంటివి డీఐజీ పర్యవేక్షణలోనే సాగాయనే విమర్శలున్నాయి.
తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీఛార్జి : గతేడాది ఆగస్టులో అంగళ్లు వద్ద మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లదాడి సంఘటనలో అధికార పార్టీని సమర్థిస్తూ ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఆ సంఘటనలో చంద్రబాబుతోపాటు మరికొందరు నాయకులపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గనిర్దేశంలో డీఐజీ చేశారని ఆరోపణలొచ్చాయి. అప్పట్లో ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’లో భాగంగా పుంగనూరు మీదుగా చంద్రబాబు పర్యటించేందుకు పోలీసులు అనుమతించలేదు.
వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు - EC TRANSFERS INTELLIGENCE DG AND CP
చంద్రబాబును పుంగనూరు మీదుగా తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులు పట్టుదలగా భీమగానిపల్లె కూడలి వద్ద ఉన్నాయి. ఆయన్ను పుంగనూరుకు రానివ్వకూడదని పోలీసులు భీష్మించుకు కూర్చున్నారు. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. రాళ్లు రువ్వారు. గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ కార్యకర్తలు సైతం ప్రతిస్పందించారు. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం శ్రేణులకు గాయాలయ్యాయి. ఈ ఒక్క సంఘటనపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. దాదాపు 600 మందిని నిందితులుగా చూపారు. 300 మందికిపైగా అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలు, కడప కేంద్ర కారాగారానికి పంపారు. సంఘటన జరిగిననాడు అక్కడ లేనివారినీ అరెస్టు చేశారు. వైసీపీ నాయకులు చెప్పినట్టు పుంగనూరు పోలీసులు వినాలని డీఐజీ అప్పట్లో ఆదేశించారనే ఆరోపణలున్నాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా స్వామి భక్తే : డీఐజీగా అమ్మిరెడ్డి బాధ్యతలు చేపట్టాక పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీవారు పేట్రేగిపోయారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేయడం, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసే విషసంస్కృతిని తెచ్చారు. అరాచకాలపై డీఐజీగా చర్యలు తీసుకోవాల్సిన అమ్మిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లు చేశారు. శాంతిభద్రతలు అదుపు తప్పినా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో రైతుభేరి నిర్వహించాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పలుమార్లు నిర్ణయించారు. అనుమతించాలని హైకోర్టు సైతం ఆదేశించినా డీఐజీ హోదాలో ఆయన స్పందించలేదు.
ఈ ఏడాది జనవరి 12న పుంగనూరు మండలం చదళ్ల వద్ద ‘ధర్మపోరాట సభ’ నిర్వహించేందుకు రామచంద్రయాదవ్ అనుచరులు ఏర్పాట్లు చేస్తుండగా అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలను వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. గంగవరం సీఐ కృష్ణమోహన్ ఒక కార్యకర్తను చెప్పుతో కొట్టారు. దీనిపై డీఐజీకి ఫిర్యాదు చేసినా సదరు సీఐపై చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా డీఐజీ అమ్మిరెడ్డి స్వామి భక్తిని వీడలేదు. గత నెలలో సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించినపుడు నిబంధనలు పక్కనపెట్టి సీఎం కాన్వాయ్ ముందు నడుస్తూ భద్రత పర్యవేక్షించారు. అలాగే ఇటీవల సీఎం జగన్ తాడిపత్రి పర్యటనకు వచ్చినప్పుడు అనంతపురంనుంచి తాడిపత్రి వరకు మంత్రి పెద్దిరెడ్డి వెంట వెళ్లారు.
‘వాడిని మాకు వదిలేయండి. బుద్ధి చెబుతాం’ అంటూ హెచ్చరికలు : మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో ఏప్రిల్ 29న రామచంద్ర యాదవ్, ఆయన అనుచరులు ప్రచారానికి వెళ్లారు. మంత్రి ఊళ్లో ఎలా ప్రచారం చేస్తారని వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ప్రచార వాహనాలపై దాడి చేశారు. అక్కడున్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నియంత్రించేందుకు ప్రయత్నించలేదు. అక్కడినుంచి తప్పించుకుని కొంతదూరంలోని గొడ్లవారిపల్లెకు రాగా అక్కడా వైసీపీ శ్రేణులు విధ్వంసానికి దిగాయి. ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా దాదాపు 200 మంది వైసీపీ కార్యకర్తలు స్టేషన్ బయట, ఆవరణలో మోహరించారు. ‘వాడిని మాకు వదిలేయండి. బుద్ధి చెబుతాం’ అంటూ హెచ్చరించారు. స్టేషన్ ఎదుటే ఉన్న ప్రచార రథానికి నిప్పుపెట్టారు. మరుసటి రోజు డీఐజీ అమ్మిరెడ్డి సదుం పోలీసుస్టేషన్, యర్రాతివారిపల్లెలకు వచ్చి పరిశీలించి వెళ్లారు. బాధ్యులైన వైసీపీ నాయకులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మిరెడ్డి, పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రామచంద్రయాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అమ్మిరెడ్డిపై వేటు పడటానికి ప్రధాన కారణం సదుం మండలంలో జరిగిన సంఘటనేనని తెలుస్తోంది.
ఎన్నికలు పూర్తయ్యే వరకూ అమ్మిరెడ్డిని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది.
ఇంటిలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై బదిలీ వేటు - EC transfers Intelligence DG and SP