Election Commission Appointed District Collector and 3 SPs in AP : రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్ (Srikesh Balaji Rao Latkar), ఎస్పీగా మలికా గార్గ్ (Malika Garg), అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి (Gautami Shali), తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు (V. Harshavardhan Raju)ను నియమించింది. ఎన్నికల పరిశీలకుల విధుల్లో లేని అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని, ఆ విధుల్లో ఉన్నవారు ఆదివారం బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందుమాధవ్ గరికపాటి, అమిత్ బర్దర్‌లను సస్పెండ్ చేసి, పల్నాడు కలెక్టర్ ఎల్.శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో ఈ కొత్త అధికారులను నియమించింది.
రాష్ట్రంలో హింసాకాండను నియంత్రణలో పోలీసు బాస్‌లు విఫలం - ఈసీ వేటుకు బలి - EC Suspend SPs in AP
శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్ : 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్ ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ ఏడాది జనవరి వరకూ ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. అంతకుముందు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా, విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన్ను పల్నాడు జిల్లా కలెక్టర్‌గా నియమించారు.
మలికా గార్గ్ : పల్నాడు ఎస్పీగా నియమితురాలైన మలికా గార్గ్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రెండున్నరేళ్ల పాటు ప్రకాశం ఎస్పీగా పనిచేశారు. ఎన్నికలకు ముందు నెల రోజులు తిరుపతి ఎస్పీగా ఉన్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో ఆమె బదిలీ అయ్యారు. ప్రస్తుతం సీఐడీలో ఎస్పీగా ఉన్నారు.
గౌతమి శాలి : అనంతపురం ఎస్పీగా నియమితులైన గౌతమి శాలి 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం విజయనగరం, విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్లకు కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వరకూ అనకాపల్లి ఎస్పీగా పని చేశారు. గతంలో విశాఖపట్నం శాంతి భద్రతల విభాగం డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.
వి.హర్షవర్ధన్ రాజు : ప్రస్తుతం సీఐడీ సైబర్ నేరాల విభాగం ఎస్పీగా ఉన్న వి.హర్షవర్ధన్ రాజు 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆయన్ను తిరుపతి ఎస్పీగా నియమించారు.
పల్నాడు గొడవల్లో కోవర్ట్ ఆపరేషన్? - ఇంటిదొంగలపై పోలీస్‌శాఖ విచారణ - POLICE HELP IN PALNADU VIOLENCE