Election Code And Schedule in General Elections: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్లో నాలుగు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. 2024 మే 13న పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 18 తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కానుంది. షెడ్యూలు ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు రెండున్నర నెలల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. కోడ్ అమలుతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వివరాలు తెలియజేశారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ - ఫ్లెక్సీల తొలగింపు - నేతల విగ్రహాలకు ముసుగు
హింస, రీపోలింగ్ లేని ఎన్నికలు నిర్వహణే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల పోలీసు నోడల్ అధికారి శంకబ్రత బాగ్చి స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల బందోబస్తు కోసం 2.18 లక్షల మంది పోలీసు సిబ్బంది అవసరం అవుతారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నవారితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ బలగాలు, పారామిలటరీ పోలీసులను కూడా పంపించాలని ఆయన వివరించారు. తనిఖీల కోసం 121 చెక్ పోస్టులతో పాటు మరిన్ని పెంచుతామన్నారు. ప్రజలు ఉచితాలు, ఇతర ప్రలోభాలు, అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఈసీకి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఏడు దశల్లో 2024 లోక్సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఏప్రిల్ 29 అని ఈసీ పేర్కొంది. ఇక 2024 మే 13 తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ 4 తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్టు సీఈఓ ప్రకటించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు. 25 పార్లమెంటు, 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం 46,165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 4,09,37,352 మంది ఓటర్లు నమోదు అయినట్లు వెల్లడించారు. ఇందులో కొత్త ఓటర్ల సంఖ్య 9 లక్షలుగా ఉందని తెలిపారు. ఇవాల్టి నుంచి ఓటర్ల నమోదు, తొలగింపునకు సంబంధించిన దరఖాస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు వివరించారు. తుది ఓటర్ల జాబితా విడుదల తేదీ నుంచి ఇప్పటి వరకూ 1.75 లక్షల మంది కొత్తగా ఓటర్లు చేరినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అదే సమయంలో 85 ఏళ్ల కంటే పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేలా చర్యలు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్- వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే వీల్లేదు : CEO
కోడ్ అనంతరం అధికార యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం ఆధీనంలోకి వచ్చిందని సీఈవో స్పష్టం చేశారు. ప్రధాని మినహా ఎవరికీ సెక్యూరిటీ ప్రోటోకాల్ లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీల్లేదని మరోసారి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులను కేవలం ఇంకు వేసేందుకు మాత్రమే వినియోగిస్తామన్నారు. ఉపాధ్యాయులు లేకుండా రాష్ట్రంలో ఎన్నికలే జరిగే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.