ED Searches Completed at YCP MP MVV Satyanarayana and Auditor : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ, ఆయన స్నేహితుడు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు పూర్తయ్యాయి. విశాఖ రుషికొండలోని MVV నివాసం, లాసన్స్ బే కాలనీలోని కార్యాలయం, ఇల్లు, జీవీ స్కేర్ లోని ఆడిటర్ జీవీ కార్యాలయం, ఇంటిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనేక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని పత్రాలను తీసుకుని వెళ్లారు. ఫోర్జరీ సంతకాలతో హయగ్రీవ భూములు లాక్కున్నారంటూ చిలకలూరి జగదీశ్వరుడు, ఆయన భార్య జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. మాజీ ఎంపీ ఎంవీవీ, జీవీ నుంచి జగదీశ్వరుడి మధ్య రూ. 9 నుంచి రూ. 12 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈడీ సోదాలు చేసినట్లు తెలుస్తోంది.
విశాఖలో ఈడీ - వైఎస్సార్సీపీ నేత ఎంవీవీ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు
స్టేట్‌మెంట్లు రికార్డు : విశాఖ వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు, ఆడిటర్, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు శనివారం సోదాలు జరిపారు. ఏకకాలంలో ఐదు బృందాలుగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. శనివారం ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. తనిఖీల సమయంలో మాజీ ఎంపీ ఎంవీవీ, జీవీలువారి నివాసాల్లోనే ఉన్నారు. తనిఖీల అనంతరం వారి నుంచి ఈడీ అధికారులు స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు.
హయగ్రీవ కేసు ఇదే : 2008లో చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు ఎండాడలో 12.51 ఎకరాలను ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది. ఆడిటర్‌గా రంగప్రవేశం చేసిన జీవీ, ప్రాజెక్టు అభివృద్ధి కోసం గద్దె బ్రహ్మాజీని పరిచయం చేశారు. తదనుగుణంగా ఒక ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీవీ చేతుల్లోకి ప్రాజెక్టు వెళ్లిపోయింది. ఆయన ఆ భూమికి జీపీఏ హోల్డర్. ‘2020లో మా సంతకాలు ఫోర్జరీ చేశారు. అమ్మకపు పత్రాలు తయారు చేసి బలవంతంగా విలువైన ఆస్తిని లాక్కోవడానికి నేరపూరితంగా వ్యవహరించారు. సేల్‌డీడ్‌లను దుర్వినియోగం చేశారు’ అంటూ ఈ ఏడాది జూన్‌లో జగదీశ్వరుడు ఆరిలోవ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంవీవీ, జీవీ, గద్దె బ్రహ్మాజీలపై కేసు నమోదైంది. ఇదే కేసులో ఈ నెల 17వ తేదీన ఆ ముగ్గురికీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.