Economist Professor Mahendra Dev on Andhra Pradesh Debts : రాష్ట్రాల రుణాలు పెరిగితే భవిష్యత్ తరాలపై భారం పడుతుందని ఆ అప్పులు చెల్లించాల్సింది మన పిల్లలు, ఆ తర్వాతి తరాలేనని ప్రముఖ ఆర్థికవేత్త, 'ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (Economic and Political Weekly)' ఎడిటర్ ప్రొఫెసర్ ఎస్.మహేంద్రదేవ్ హెచ్చరించారు. 'అభివృద్ధితో సంక్షేమం-సుపరిపాలనకు సవాళ్లు' అనే అంశంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (CFD) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం : పథకాల అమలుకు అదనపు బడ్జెట్ కావాలని ఎస్.మహేంద్రదేవ్ తెలిపారు. గ్యారంటీలు సహా వివిధ రూపాల్లో రుణాలు తెచ్చుకోవాలని, దీంతో రాష్ట్ర అప్పులు పెరుగుతాయి. రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఆ రుణాలకు వడ్డీ రూపంలోనే అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా ఇతర కార్యక్రమాలను అమలు చేయలేరని అన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమని, పెట్టుబడి వ్యయంపై రూ.1 ఖర్చు పెడితే రూ.3 రాబడి వస్తుందని, రెవెన్యూ వ్యయంలో దీన్ని సాధించలేమని తెలిపారు.
వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన జాతీయ రహదారుల నిర్మాణమే దీనికి ఉదాహరణ అని గుర్తు చేశారు. సూరత్, శ్రీకాకుళం జిల్లాల్లో చేసిన అధ్యయనాల్లో జాతీయ రహదారుల పక్కన నిర్వహించే వ్యాపారాల్లో 100% వృద్ధి నమోదైనట్లు వెల్లడైందని అన్నారు. ఉద్యోగ కల్పనకు పెట్టుబడి వ్యయం ఎంతో ముఖ్యమని తెలిపారు. పేదరికం తొలగించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన అత్యవసమని సూచించారు.
"దేశంలో 15-29 ఏళ్ల వయసున్న వారిలో 27% నిరుద్యోగులే. సెకండరీ విద్య, ఆపై చదివిన వారిలో 18% నిరుద్యోగులున్నారు. పట్టభద్రులు, ఆపై చదివిన వారిలో 28% మందికి ఉద్యోగాల్లేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 30% వరకు ఉంది. నిరుద్యోగుల్లో 83% మంది యువతే. వారికి నైపుణ్యం లేకపోవడమే దీనికి కారణం. ఫార్మల్ స్కిల్స్ కలిగిన వారు భారతదేశంలో 4% మాత్రమే. ఈ సంఖ్య యూకేలో 50%, సౌత్ కొరియాలో 96%గా ఉంది."- ఎస్.మహేంద్రదేవ్, ప్రముఖ ఆర్థికవేత్త, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ఎడిటర్ ప్రొఫెసర్
ఒక్కొక్కరిపై 2 లక్షల రూపాయల రుణ భారం : రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణ భారం ఉందని సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగి 3 లక్షల రూపాయలు అవుతుందని, అంటే భవిష్యత్తులో మన పిల్లలకు అవసరమైన నిధుల్ని కూడా ఇప్పుడే తీసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్ దా'రుణం' - రాష్ట్ర సచివాలయం తాకట్టు! అప్పుకోసం ఇంతలా దిగజారాలా