ECI Direction on PM Meeting Security Lapses: ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని ఈసీఐ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. టీడీపీ- బీజేపీ-జనసేన పార్టీలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. త్వరితగతిన విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నివేదిక ఇచ్చినట్లు సీఈఓ తెలిపారు. ఆళ్లగడ్డ హత్య ఘటన కుటుంబ కక్షల వల్ల జరిగిన హత్యగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి చెప్పినట్లు, ఆ మేరకు నివేదిక ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మాచర్ల కారు దహనం ఘటన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణేనని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వివరణ ఇచ్చారనీ తెలిపారు. మాచర్ల ఘటనలో ఇవాళ రాత్రికి నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ వివరణ ఇచ్చారన్నారు.
ప్రజాగళంలో సభలో పోలీసుల వైఫల్యం - ప్రధాని ప్రసంగానికి పలుమార్లు ఆటంకం
మూడు ఘటనలపై ఎస్పీల నుంచి వివరణ తీసుకున్నామని, రాజకీయ హింస ఘటనలపై తక్షణం ఈసీఐకి నివేదిక పంపిస్తామని సీఈఓ తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చాక రాజకీయ హింస జరగకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని, కోడ్ వచ్చిన మరుసటి రోజే హింసాత్మక ఘటనలు జరగడంతో ఈసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందనీ సీఈఓ తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలని ఈసీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందనీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
హింసాత్మక ఘటనలు జరగకూడదని మరోమారు ఎస్పీలకు గట్టిగా చెప్పామన్నారు. రాజకీయ హింసను నిరోధించేలా అన్ని పార్టీలను హెచ్చరించాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో పరామర్శ చేసుకోవచ్చు కానీ, చెక్కుల పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘనే అవుతుందని, దీనిపై జిల్లా కలెక్టర్లని నివేదికలు అడిగినట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘనలకు సంబధించి రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు వాలంటీర్లను విధుల్నుంచి తొలగించినట్లు వెల్లడించారు.