Drinking Water Scarcity in Srikakulam District : గుక్కెడు నీటి కోసం ఆ తీర ప్రాంత ప్రజలు పడే పాట్లు వర్ణనాతీతం. ఇసుక తిన్నెల్లో కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్యను ఎవరూ పరిష్కరించలేదంటూ నిట్టూరుస్తున్నారు. అపరిశుభ్ర నీటిని తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల వెతలపై ప్రత్యేక కథనం.
చిన్న డబ్బా సాయంతో నీటిని తోడి బిందెను నింపుకొంటున్నారు. పక్కన మరికొందరు మహిళలు ఉపాధి పనులను కూడా వదిలేసి ఖాళీ బిందెలను నీటితో నింపుకొనేందుకు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి. డొంకూరు, చిన్న లక్ష్మీపురం, శివకృష్ణపురం సహా చుట్టుపక్కల గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం ఇక్కడి ప్రజలు సుమారు 3 కిలోమీటర్లు ఇసుకలో నడిచివెళ్లాల్సిందే. ఇంత కష్టపడి అక్కడికి వెళ్లినా అప్పటికే పెద్ద క్యూలైన్ ఉంటుంది. తీర ప్రాంతంలో చెలమలు తవ్వుకుని బిందెడు ఊట నీరు పట్టుకుంటున్నారు. అవి కూడా ఎర్రటి రంగులో ఉంటాయి. వాటిని వడపోసి ఇంటికి తీసుకువెళ్లి మరగబెట్టి తాగాలి. ఊరిలో ఎక్కడ బోరు బావి తవ్వినా, ఉప్పు నీరు రావటంతో రెండు దశాబ్దాలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఊట నీరు తాగటంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ఊరిలో ఎక్కడ బోరు బావి తవ్వినా ఉప్పు నీరు రావడంతో దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉంది. అధికారులకు ఎన్నోసార్లు మా పరిస్థితి వివరించినా పట్టించుకున్న నాధుడే లేడు. ప్రతిరోజు కిలోమీటర్లు అధిక బరువుతో నడవడం వల్ల అనేక శారీరక సమస్యలు కూడా వస్తున్నాయి.' -స్థానికులు
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్థానికులు మండిపడ్డారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేసిన జల్‌జీవన్ మిషన్ పథకం పనుల కింద తమ గ్రామాలకు కనీసం పైపులైన్లు కూడా వేయలేదన్నారు.
ఇంటింటికీ కుళాయి నీరందిస్తామని ఎన్నికల ముందు వైకాపా హడావిడి చేసిందని స్థానిక శాసనసభ్యుడు బెందాళం అశోక్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు