Drinking Water Problems in Krishna District: తాగడానికి గుక్కెడు మంచినీళ్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండంటూ కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. వేసవి రాకముందే తాగునీటికి ఎద్దడి ఏర్పడిందని వాపోతున్నారు. రాబోయే కాలంలో తమ పరిస్థితి ఎలా ఉండబోతుందో తలుచుకుంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గుక్కెడు తాగునీటికి అల్లాడుతున్నారు. సమస్య పరిష్కరించాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంతో, ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కేంద్ర పథకం జల్‌జీవన్ కింద చేపట్టిన ఇంటింటికీ కుళాయి పథకం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియడం లేదు.
'మంచినీళ్లు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి'- ఖాళీ కుండలతో మహిళల నిరసన
మచిలీపట్నం నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలైన కొన, పల్లెతుమ్మలపాలెం, పొలాటితిప్ప సహా పలు గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. నిత్యం మంచినీటి ట్యాంకుల చుట్టూ డ్రమ్ములతో ప్రజలు దర్శనమిస్తున్నారు.
"తాగునీటికి ఇబ్బందిగా ఉంటోంది. నీటి కోసం చాలా కష్టపడుతున్నాం. ఓ సమయమనేది లేకుండా నీటిని పంపిణీ చేస్తున్నారు. ఒకరోజు వదిలి మరో రోజు వదులుతున్నారు." -లక్ష్మి, కోన గ్రామం
ఆరు రోజులకోసారి మంచినీళ్లు - బ్రతికేది ఎలా అంటున్న గ్రామస్థులు
వేళకాని వేళల్లో నీరు వదులుతున్నారని, నీరు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంత మండలాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు మినరల్ వాటర్‌పై ఆధార పడాల్సిన పరిస్థితుల నెలకొన్నాయి. ప్రజలకు తాగునీటి సరఫరా తమ బాధ్యత కాదన్ననట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తామని చేయలేదు. గృహిణిలకు నీటితోనే కదా బాధ. ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము." -రాజేశ్వరి, కోన గ్రామం
తాగునీటి కోసం రాత్రిపూట మహిళల ఆందోళన - రోడ్డుపై బైఠాయింపు
"నీళ్లు రాని సమయంలో ట్యాంకర్ల ద్వారా వస్తున్న నీటిని కొనుగోలు చేసుకుంటాము. లేదంటే పొలాల వద్దనున్న బోర్లు, బావుల వద్దనుంచి తీసుకువస్తాము." - జయలక్ష్మి, కోన గ్రామం
సొంతగా పంపులు వేయించుకోవాలని చూసినా సముద్ర ప్రాంతం కావడంతో నీళ్లు ఉప్పగా ఉండి తాగేందుకు ఉపయోగపడడం లేదని మహిళలు వాపోయారు. రోజూ మినరల్ వాటర్ కొనే ఆర్థిక స్థోమత లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాగునీటి సరఫరా బిల్లుల కోసం రోడ్డెక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు