Drinking Water Problem in Anantapur District : వేసవి ప్రారంభానికి ముందే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించి, ప్రజలకు నీరందించే ఏర్పాట్ల కోసం 7 కోట్ల రూపాయల నిధులివ్వాలని గ్రామీణ నీటి సరఫరా పథకం అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికపై సర్కారు నుంచి స్పందన కరవైంది. గతంలో పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కాజేసిన జగన్ ప్రభుత్వంపై గ్రామ సర్పంచులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం ఈసారి గ్రామ పంచాయతీ ఖాతాలకు నేరుగా అభివృద్ధి నిధులను విడుదల చేసింది. ఈ నిధులను కాజేయడానికి అవకాశం లేకపోవడంతో, గ్రామాల్లో తాగునీటి ఏర్పాట్లకు పంచాయతీ నిధులే వెచ్చించుకోవాలని జగన్ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటికే గ్రామాల్లో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించటానికి ఆర్‌డబ్య్లూఎస్ (Rural Water Supply) అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోతున్నారు. ఈ శాఖ వద్ద నిధులు లేకపోవడం, గ్రామ పంచాయతీ నిధులతోనే తాగునీటి బోర్లు మరమ్మతు చేసుకోవాలని చెప్పడంతో సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో ఇప్పటికే వందలాది గ్రామాల్లో ప్రజలు తాగునీటికే కాదు, వాడుక నీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం వల్ల ఈసారి వేసవిలో కొన్ని గ్రామాల్లోనే తాగునీటి సమస్య తలెత్తిందని అధికారులు చెబుతుండగా, పక్షానికోసారి స్నానం చేయాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటాడుతున్న నిధుల కొరత: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో 5 వేల 747 తాగునీటి బోర్లు ఉండగా వీటిలో 2336 బోర్లు పని చేయటం లేదు. వీటిలో చాలావరకు మరమ్మతులు చేస్తే గ్రామాల్లో దాహార్తిని తీర్చే అవకాశం ఉన్నా, నిధుల లేమి కారణంగా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల్లో 54 గ్రామాల్లోనే తాగునీటి సమస్య తలెత్తిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ, సుమారు 170 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
డెడ్ స్టోరేజ్‌కు చేరిన శ్రీశైల జలాశయం - Srisailam water Dead Storage
వందల గ్రామాలకు నీరు అందడం లేదు: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా తొమ్మిది వందల గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండగా, రెండు వందలకు పైగా గ్రామాలకు నీరందడం లేదు. అదేవిధంగా శ్రీ సత్యసాయి తాగునీటి పథకం సుమారు ఆరు వందల గ్రామాలకు నీరందించాల్సి ఉండగా వందకు పైగా గ్రామాలకు నీరు వెళ్లడం లేదని సమాచారం.
మరమ్మతులూ చేయలేని దుస్థితి: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జూన్, జులై వరకు నీటి నిల్వలు అందుబాటులో లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అధికారులు మాత్రం ఆగస్టు వరకు తాగునీరు సరిపోతుందని చెబుతూనే, నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. చాలా గ్రామాల్లో ప్రజలు ఫిల్టర్ నీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం వాడుక నీటిని కూడా విడుదల చేయలేకపోతోంది. గ్రామాల్లో తాగునీటి బోర్లకు చిన్నపాటి మరమ్మతులు చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
నీటి సమస్యపై గ్రామాల్లో మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి పంచాయతీ నిధులు వెచ్చించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ఉండదని, స్థానికంగా బోర్లు రిపేరు చేయించి నీటి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
"ఈ సారి ఇంటి దగ్గరకి వచ్చిన వాళ్లకి ఓటు వేయము. మాకు నీళ్లు ఎవరిస్తే వారికే ఓటు వేస్తాము. మేము రెండు కిలోమీటర్ల దూరంపోయి నీళ్లు తీసుకొనిరావాలి. తాగడానికి నీళ్లు లేవు. అసలు పది రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాము. ట్యాంక్‌తో కూడా నీళ్లు రావడం లేదు. గతంలో కొన్ని రోజులు తీసుకొని వచ్చినారు. తరువాత రావడం లేదు". - అనంతపురం వాసులు
కడప జిల్లాలో జలయజ్ఞం ఇదేనా! గుక్కెడు తాగు నీటి కోసం నరకయాతన - huge water problem in ysr district