Disorganized Sanitation in Guntur : వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు. దుర్గంధంతో జనం అవస్థలు. గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పుడిదే అపరిశుభ్రత తాండవిస్తోంది. నగరంలోని అరండల్ పేట, బ్రాడీపేట, కొరిటెపాడు, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, మార్కెట్ సెంటర్, పాత గుంటూరు ఇలా, అన్ని ప్రదేశాల్లో చెత్త రోడ్లమీదే ఉండిపోయింది. ఇళ్లు, హోటళ్ల నుంచి సేకరించిన చెత్తను ఆయా ప్రాంతాల్లోని డంపింగ్ స్టాక్ పాయింట్లో పడేస్తున్నారు. నిజానికి అక్కడ నుంచి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. ఆ పని జరగకపోవడం వల్లే పారిశుద్ధ్యం పడకేసింది.
Sanitation Problem in Guntur : గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 2200 మంది సిబ్బంది శానిటేషన్ విభాగంలో పని చేస్తున్నారు. చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లు, డంపర్ వాహనాలు 130 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా ఈ-ఆటోలను చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు వినియోగిస్తుంటారు. అయితే సుమారు 600 మంది మున్సిపల్ కార్మికులు, సగం వాహనాలను విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు అధికారులు పంపించారు. 22 మంది శానిటేషన్ కార్యదర్శుల్లోదాదాపు 10 మందిని విజయవాడ పంపినట్లు తెలుస్తోంది. గుంటూరులో మెుత్తం 750 చెత్త సేకరణ స్టాక్ పాయింట్లుండగా కేవలం కొన్ని చోట్ల నుంచి మాత్రమే డంపింగ్ యార్డులకు తరలుతోంది. మిగిలిన అన్నిచోట్ల అలాగే పోగుబడింది.
గగ్గోలు పెడుతున్న స్థానికులు : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అనేక చోట్ల మండపాలు ఏర్పాటు చేశారు. అన్నదానం కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. అక్కడి భోజన ప్లేట్లు, గ్లాసులు, మిగిలిన ఆహార పదార్థాలను సైతం చెత్త డబ్బాల్లో వేస్తున్నారు. ఎప్పటికప్పుడు దాన్ని తరలించకపోవడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. గణేష్ మండపాల వద్ద కూడా అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
రోగాలు బారిన పడుతున్న పెద్దలు : ఇటీవలి వర్షాలకు నగరంలోని ఖాళీ స్థలాల్లో మురుగు చేరి పారిశుద్ధ్యం గాడి తప్పింది. దోమలు పెరిగి పిల్లలు, పెద్దలు వైరల్ జ్వరాల బారిన పడ్డారు. చెత్తను వెంటనే తొలగించకపోతే రోగాలు పంజా విసిరే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.