Farmers waiting for rain In Adilabad : రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడంతో రైతన్నలు విత్తనాల హడావిడిలో ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. వానాకాలం వచ్చినప్పటికీ ఎండాకాలం పోవటం లేదు. అక్కడక్కడ అడపా, దడపా చిరుజల్లులు కురిసినప్పటికీ భానుడి భగభగ ఆగటంలేదు. నేలను చదును చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్న అన్నదాత తొలకరి పలకరింపు కోసం ఎదురు చూస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణ స్థితి : రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక, వాతావరణ స్థితి భిన్నంగా ఉంటుంది. వేసవిలో అత్యధికంగా 47 డిగ్రీలకు చేరుకునే ఎండలు, శీతాకాలంలో మూడు, నాలుగు డిగ్రీలకు పడిపోయే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లా వానాకాలంలో రాష్ట్రంలోనే అధిక వర్షాలు కురిసే ప్రాంతంగా పేరుంది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా కన్పిస్తోంది. రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భరించలేని ఉక్కపోతతో జనాలు సతమతమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు వేయడానికి నేలను చదును చేసిన రైతులు వరణుడి పలకరింపు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
"మేము మా పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేశాం. విత్తనాలు వేసేందుకు ఎప్పుడు వర్షాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నాం. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ మా జిల్లాకు మాత్రం ఆ జాడలు కనపించడం లేదు. ఆదిలాబాద్లో విపరీతమైన ఎండలు ఉన్నాయి. వర్షం ఎప్పుడు వస్తుందో ఎమో తెలియని పరిస్థితి ఉంది. వాతావరణ సమాచారం గురించి రైతులకు అధికారులు సూచనలిస్తే బాగుంటుంది"- రైతులు, ఆదిలాబాద్
వర్షపు జల్లులు కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్న : రాష్ట్రంలో పత్తి పంట సాగుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి పొందింది. మొత్తం 16లక్షల ఎకరాల సాగులో ఈ ఏడాది 12.50లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే వస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సకాలంలో వర్షాలు కురవనట్లయితే విత్తనదశలోనే నష్టం చవిచూడాల్సి వస్తుందని అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు వేసవి తాపంతో భరించలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. భానుడి భగభగలతో సతమతమవుతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చిరుజల్లుల కోసం వేచిచూస్తున్నారు.
నీరు లేక చివరి దశలో ఎండిపోతున్న పంటలు- కాపాడుకునేందుకు రైతుల నానాతంటాలు
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతులకు నీటికష్టాలు - కాలువలో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు