DGP Report to CEO about Pinnelli Ramakrishna Reddy EVM Destroy Incident : మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈసీకి నివేదిక పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని ఆయన్ను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని నివేదికలో పేర్కోన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఈసీ పంపిన తాఖీదుకు సీఈఓ సమాధానం ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్యే అరెస్టు, కేసుల నమోదు, సిట్ పేర్కొన్న అంశాలతో డీజీపీ హరీష్ కుమార్ గుప్త కూడా సీఈఓకి వివరణ నివేదికను ఇచ్చారు. ఇందులోని అంశాలను యథాతథంగా ఈసీకి పంపినట్టు తెలుస్తోంది. మాచర్ల ఘటనలో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈసీకి నివేదిక పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని ఆయన్ను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు పని చేస్తున్నట్టు ఈసీకి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై వివరణ ఇవ్వాలంటూ భారత ఎన్నికల సంఘం పంపిన తాఖీదుకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు అంశంపై ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్త సీఈఓ మీనాకు నివేదిక పంపారు. పోలింగ్ జరిగిన 13 తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలనాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎం ధ్వంసం చేశారని డీజీపీ తన నివేదికలో పేర్కోన్నారు. ఇద్దరు అనుచరులు వై శ్రీనివాసరెడ్డి, జీశ్రీనివాసరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేశారని పేర్కోన్నారు. మే 15 తేదీన నమోదు చేసిన కేసులో పీడీపీపీ చట్టంలోని సెక్షన్లు 448, 427 రెడ్ విత్ 34 కింద అభఇయోగాలు నమోదు చేసినట్టు వెల్లడించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కోంటూ మే 20 తేదీన మరికొన్ని సెక్షన్లు ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 448, 427,353, 452, 12బి రెడ్ విత్ 149 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో పాటు ఆర్పీయాక్టు లోని సెక్షన్ 135,131 కింద కూడా అభియోగాలు మోపినట్టు డీజీపీ వివరించారు.
రాష్ట్రంలో ఎన్నికల హింసపై ఈసీకి సీఎస్, డీజీపీ వివరణ - CS and DGP Explanation to EC
ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సి ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదికలో పేర్కోన్నారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో 4 బృందాలు, డీఎస్పీ నేతృత్వంలో మరో 4 బృందాలు గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పరారు కాకుండా లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేసినట్టు వెల్లడించారు. వీలైనంత త్వరలోనే ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం ఘటనలో ఈవీఎం ధ్వంసం పై సిట్ విచారణ నివేదికనూ జత చేసి సీఈఓకి పంపించారు. 13 తేదీ మద్యాహ్నం 12.30 గంటలకు ఈవీఎం ధ్వంసమైందని డీజీపీ తన నివేదికలో పేర్కోన్నారు. 15 తేదీ మద్యాహ్నం 2.30 గంటలకు బీఎల్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు పెట్టినట్టు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్టు నమోదు చేశామని స్పష్టం చేశారు. కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ ధ్వంసమైనట్టు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని వెల్లడించారు. వీటి విలువ రూ. 2 వేల రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా రికార్డు చేసిన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా పేర్కోన్నామని తెలిపారు.
ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటు ఆయన ఇద్దరు అనుచరులు వైశ్రీనివాసరెడ్డి , జీ శ్రీనివాసులు రెడ్డిలను 2,3 నిందితులుగా పేర్కోన్నామని వెల్లడించారు. ఈ ఘటనలో పంచనామా చేయలేదన్న సిట్ పరిశీలనల్ని కూడా డీజీపీ తన నివేదికకు జత చేశారు. విచారణ చేయాల్సిన దర్యాప్తు అధికారి సాక్షుల నుంచి వాంగ్మూలమూ తీసుకోలేదని సిట్ పేర్కోందని స్పష్టం చేశారు. కనీసం 202 పోలింగ్ కేంద్రంలోని ప్రిసైడింగ్ అధికారులను కూడా విచారించలేదని సిట్ స్పష్టం చేసినట్టు నివేదికలో వెల్లడించారు. మరోవైపు డీజీపీ పంపిన నివేదికను భారత ఎన్నికల సంఘానికి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పంపించారు.